ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మరో పరువు హత్య కలకలం రేపింది. తమ కులం అమ్మాయిని ప్రేమించాడని ఓ దళితుడిని దారుణంగా చంపేశారు. ఒంటికి నిప్పు అంటించి సజీవదహనం చేశాడు. కాగా... కొడుకు మరణవార్త విని తల్లి కూడా ప్రాణాలు కోల్పోయింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హర్దోయి జిల్లా బదేస గ్రామానికి చెందిన యువకుడు అభిషేక్ ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆ యువకుడు దళితుడు కావడం.... యువతి అగ్రకులానికి చెందిన అమ్మాయి కావడం గమనార్హం. దీంతో...యువకుడిపై యువతి కులానికి చెందిన వారు కోపం పెంచుకున్నారు.

ఈ క్రమంలో శనివారం రాత్రి  అభిషేక్.. తన ప్రియురాలిని కలిసి ఇంటికి వెళ్తున్నాడు. ఆ సమయంలో కాపు కాసిన యువతి కులస్థులు... అభిషేక్ ని పట్టుకున్నారు. యువతి కుటుంబసభ్యులు, వారి కులస్థులు అభిషేక్ పై దాడి చేశారు.  దారుణంగా కొట్టి... ఇంట్లో పడేసి నిప్పు అంటించారు. తీవ్ర గాయాలపాలైన అభిషేక్ ని స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు.

ఆస్పత్రికి తీసుకువెళ్తుండగానే యువకుడు ప్రాణాలు వదిలాడు.కాగా.. కొడుకు మరణ వార్త విని అభిషేక్ తల్లి గుండెపోటుతో కన్నుమూసింది. ఈ సంఘటన స్థానికులను మరింత కలవరపరిచింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.