ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో యూపీ టూరిజం ప్రమోషన్ ... మంచి ప్లానే వేసారుగా!

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహాకుంభ్ 2025 లో ఒక భారీ పెవిలియన్ ఏర్పాటు చేస్తోంది, ఇక్కడ రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలు, హస్తకళలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఒడిఓపి ఉత్పత్తులు ప్రదర్శించబడతాయి.

Uttar Pradesh Grand Pavilion at Maha Kumbh 2025 Showcasing Tourism Culture and ODOP Products AKP

ప్రయాగరాజ్ : మహా కుంభమేళా-2025 లో ఉత్తర ప్రదేశ్ పర్యాటక శాఖ దాదాపు 5 ఎకరాల్లో స్టేట్ పెవిలియన్‌ను ఏర్పాటు చేయనుంది. పర్యాటకులు ఇక్కడ రాష్ట్రంలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు...  అలాగే అనేక ఆకర్షనీయ విశేషాలు చూడగలరు. హస్తకళల బజార్, సాంస్కృతిక కార్యక్రమాలతో సహా అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. పెవిలియన్‌లో ప్రసిద్ధ హస్తకళల బజారు ఏర్పాటు చేస్తారు. దీతోపాటు, దేవాలయాల ప్రదర్శన కూడా ఉంటుంది.

సెక్టార్-7లో నిర్మాణం

మహా కుంభమేళా ప్రాంతంలోని సెక్టార్-7 నాగ్వాసుకి ఆలయం సమీపంలో దాదాపు ఐదు ఎకరాల్లో ఉత్తరప్రదేశ్ స్టేట్ పెవిలియన్ నిర్మాణం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని 12 ప్రధాన సర్క్యూట్‌ (రామాయణ, కృష్ణ బ్రజ్, బౌద్ధ, మహాభారత, శక్తిపీఠ, ఆధ్యాత్మిక, సూఫీ-కబీర్, జైన, బుందేల్‌ఖండ్, వన్యప్రాణులు, పర్యావరణ, క్రాఫ్ట్, స్వాతంత్య్ర సమరయోధుల సర్క్యూట్‌) లలోని ముఖ్యమైన ప్రదేశాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. అలాగే 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మ్యాప్‌లో త్రీ-డి సాంకేతికత ద్వారా అయోధ్య, కాశీ, మధుర, ప్రయాగరాజ్, కుషినగర్, సారనాథ్, నైమిశారణ్యతో సహా ఇతర ముఖ్యమైన ప్రదేశాలను చూపిస్తారు. ఈ ప్రదేశాల ప్రాముఖ్యత గురించి వివరిస్తారు.

రాష్ట్ర ప్రసిద్ధ వారసత్వాన్ని పరిచయం చేసే ప్రయత్నం

యూపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ మాట్లాడుతూ... ఉత్తరప్రదేశ్‌ లోని ప్రతి ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉందని చెప్పారు. దేవాలయాలు, ఆధ్యాత్మిక, సహజ పర్యాటక ప్రదేశాలతో పాటు ఇక్కడి వంటకాలు, హస్తకళలు, పాటలు, నృత్యాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. మహాకుంభ్-2025కి 40 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా. వీరికి రాష్ట్ర ప్రసిద్ధ వారసత్వాన్ని పరిచయం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు.

ఒడిఓపికి 75 స్టాల్స్

ప్రతి జిల్లాలోని వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ఒడిఓపి) కోసం 75 స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం మూడు వేదికలు నిర్మిస్తారు. స్థానిక వంటకాలతో పాటు వివిధ రాష్ట్రాల వంటకాలు అందించడానికి 20కి పైగా ఆహార స్టాల్స్ ఉంటాయి. పెవిలియన్‌లో వివిధ సెల్ఫీ పాయింట్‌లను ఏర్పాటు చేస్తారు, ఇక్కడ పర్యాటకులు సెల్ఫీలు తీసుకోవచ్చు.

ఈసారి సంప్రదాయ మహాకుంభ్ కంటే కొంత భిన్నంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఇందులో భద్రతతో పాటు పరిశుభ్రత కోసం కొత్త పరికరాలతో మొత్తం మేళా ప్రాంతాన్ని పర్యవేక్షించే ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో మహాకుంభ్-2025ని భారతదేశ సాంస్కృతిక వైవిధ్యం, ఐక్యత, ఆధ్యాత్మికతను ప్రపంచానికి చూపించాలనుకుంటున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios