Asianet News TeluguAsianet News Telugu

దేశంలో తొలి ఎడ్యుకేషన్ టౌన్‌షిప్ నిర్మాణానికి యూపీ ప్రభుత్వం నిర్ణయం.. యాక్షన్ ప్లాన్‌కు సీఎం ఆదేశాలు

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే తొలి ఎడ్యుకేషన్ టౌన్‌షిప్‌‌‌ను నిర్మించడానికి నిర్ణయం తీసుకుంది. ఐదు టౌన్‌షిప్‌లు నిర్మించాలని యాక్షన్ ప్లాన్‌కు సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆదేశించారు. అమెరికాలోని టౌన్‌షిప్‌ల తరహాలో నిర్మించాలని సూచించారు.

Uttar Pradesh govt decided to build indias first education township
Author
First Published Aug 22, 2022, 2:55 PM IST

లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలి ఎడ్యుకేషన్ టౌన్‌షిప్‌ను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఐదు ఎడ్యుకేషన్ టౌన్‌షిప్‌ల నిర్మాణానికి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఇప్పటికే సీఎం యోగి ఆదిత్యానాథ్ అధికారులను ఆదేశించారు. ఈ టౌన్‌షిప్‌లు అమెరికాలోని ఎడ్యుకేషన్ టౌన్‌షిప్‌లకు తీసిపోని విధంగా ఉండాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా నాణ్యమైన విద్య అందించడంలో రాజీ పడొద్దని తెలిపారు. 

యువతకు నాణ్యమైన విద్యను అందించడం, ఒకే ప్లేస్‌లో ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్చుకునే సౌలభ్యం తేవడం ఈ ప్రాజెక్టు చేపట్టడం వెనుక ప్రభుత్వానికి ఉన్న ప్రధాన లక్ష్యం. ఇది కేవలం మన దేశంలోని విద్యార్థులకే కాదు.. విదేశీ విద్యార్థులు వచ్చి చదువుకునేలా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్ఱికా, లాటిన్ అమెరికా దేశాలు, మధ్య ఆసియా దేశాల విద్యార్థులు ఈ టౌన్‌షిప్‌లలో వచ్చి చదువుకునేలా ఉండాలని ఆలోచనలు చేస్తున్నారు.

ఈ ప్రాజెక్టులో ప్రభుత్వం, ప్రైవేటు సెక్టార్‌లు రెండూ కీలక పాత్రలు పోషిస్తాయి. ప్రఖ్యాత ప్రైవేటు యూనివర్సిటీలు (మన దేశంలోని యూనివర్సిటీలు, అలాగే ప్రసిద్ధ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు), ప్రభుత్వ యూనివర్సిటీలు తమ క్యాంపస్‌లను ఇక్కడ నెలకొల్పేలా ఏర్పాట్లు చేయనున్నారు. వీటికితోడు అటల్ రెసిడెన్షియల్ స్కూల్స్ వంటి ప్రైమరీ, సెకండరీ స్కూల్స్ కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే, డిగ్రీ, పీజీ కాలేజీలనూ స్థాపిస్తారు. ఇక్కడే మేనేజ్‌‌మెంట్, టెక్నాలజీ, లా అండ్ మెడిసిన్‌ రంగాల్లో అధ్యయనంతోపాటు రీసెర్చ్ వర్క్ కూడా చేసేలా ఏర్పాట్లు ఉంటాయి.

అలాగే, స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సటీలను టౌన్‌షిప్‌లలో నిర్మించనున్నారు. ఇందులోనే నైపుణ్యాలు అభివృద్ధి చేసి శిక్షణ కూడా ఇచ్చే ప్లాన్స్ ఉన్నాయి. వీటితోపాటు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా ఏర్పాటు చేసి.. నీట్, ఐఐటీ, యూపీఎస్‌సీ, ఇతర పోటీ పరీక్షల్లో అభ్యర్థులను సన్నద్ధులు చేస్తారు.

అభివృద్ధి చెందిన దేశాలు అమెరికాలో పిట్స్‌బర్గ్, యూఏఈలో నాలెడ్జ్ సిటీ, షార్జాలో నాలెడ్జ్ విలేజ్ వంటివి ఉన్నాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. సింగిల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ విధానాన్ని ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిపారు. ఈ టౌన్‌షిప్‌లతో ఉద్యోగాలకు సిద్ధం అవ్వడమే కాదు.. స్వయం ఉపాధి కూడా ఏర్పాటు చేసుకునే సామర్థ్యాలను పెంపొందిస్తారని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios