జీరో టాలరెన్స్ పాలసీతో యూపీ సర్కార్ నకిలీ మద్యం వ్యాపారం మీద దాడి చేస్తోంది. దీంతో కేవలం ఆగస్టు ఒక్క నెలలోనే ఎన్ని లక్షల లీటర్ల మద్యం పట్టుబడిందో తెలుసా?  

Lucknow : ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ మద్యం ముఠాల భరతం పడుతోంది. ఇందులో భాగంగా గత ఆగస్ట్ లో కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపి 10,503 కేసులు నమోదు చేసింది యూపీ ఎక్సైజ్ శాఖ. రాష్ట్రవ్యాప్తంగా 2.69 లక్షల లీటర్ల నకిలీ మందు స్వాధీనం చేసుకున్నారు. 1,995 మందిని అరెస్ట్ చేసి, 351 మందిని జైలుకు పంపారు. నకిలీ మందు రవాణాకి వాడిన 23 వాహనాలను సీజ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా దాడులు, ఫలితాలు

మంత్రి నితిన్ అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం… ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం ముఠాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 6 వరకు 10 రోజుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇలా గత ఆగస్ట్ 31 నాటికి 1,587 కేసులు నమోదయ్యాయి… సుమారు 38,099 లీటర్ల నకిలీ మందు స్వాధీనం చేసుకున్నారు. 340 మందిని అరెస్ట్ చేసి, 83 మందిని జైలుకు పంపారు… ఈ సమయంలో నకిలీ మందు రవాణా చేసే 3 వాహనాలను సీజ్ చేశారు.

ఆదాయంలో రికార్డ్ స్థాయి పెరుగుదల

నకిలీ మద్యంపై జరుగుతున్న దాడుల ప్రభావంతో ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నాటికి రాష్ట్రానికి 22,337.62 కోట్ల రూపాయల ఎక్సైజ్ ఆదాయం వచ్చింది.ఇది గత సంవత్సరం కంటే 15.64% అంటే 3,021.41 కోట్ల రూపాయలు ఎక్కువ. ఒక్క ఆగస్టు నెలలోనే 3,754.43 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.

నకిలీ వ్యాపారస్తులపై కొరడా

సర్కార్ దాడులు, నిఘా వల్ల నకిలీ మందు వ్యాపారస్తులపై ఒత్తిడి పెరుగుతోందని మంత్రి అగర్వాల్ అన్నారు. సీఎం యోగి జీరో టాలరెన్స్ పాలసీ ఈ విజయానికి కారణమన్నారు. డిపార్ట్మెంట్ స్థాయిలో జరుగుతున్న దాడులు నకిలీ మద్యాన్ని అరికడుతున్నాయని మంత్రి అగర్వాల్ వెల్లడించారు.