కొడుకు కి ఉద్యోగం రావాలని ఓ మహిళ... కట్టుకున్న భర్తనే అతి కిరాతకంగా హత్య చేసింది. భర్త చనిపోతే... తన కొడుకుకి ఉద్యోగం, తనకు పింఛను వస్తుందని ఆమె భావించింది. అనుకున్నదే తడువుగా భర్తను నరికి ముక్కలు ముక్కలుగా చేసేసింది. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... అహ్మద్ నగర్ కు చెందిన తేజ్ రామ్ సీహీ బబుపూర్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్యూన్ గా పనిచేస్తున్నాడు. వచ్చే ఏడాది ఆయన పదవీ విరమణ పొందాల్సి ఉంది. కాగా... ఆయనకు భార్య మైమవతి, కుమారులు జగ్ వీర్, కపిల్ ఉన్నారు. 

పదవీ విరమణకు ముందే భర్త చనిపోతే... ఆ ఉద్యోగం తన కొడుకుకి వస్తుందని ఆమె భావించింది. అంతేకాకుండా అదనంగా తనకు పింఛను కూడా వస్తుందని భావించింది. ఈ క్రమంలోనే కొడుకు కపిల్ తో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం భర్త శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి.. శవాన్ని గోనె సంచిలో ఉంచి చెత్త కుప్పలో పడేశారు.

భరించలేని వాసన రావడంతో గమనించిన స్థానికులు...వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వారు వచ్చి పరిశీలించి దర్యాప్తు చేయగా.. అసలు నిజం బయటపడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.