అమ్మ, నాన్న తర్వాత అండగా ఉండాల్సిన వాడిని అన్న అంటారు. ఎల్లప్పుడూ రక్షణగా ఉండాల్సిన సోదరుడే.. సొంత చెల్లెలిపై కన్నేశాడు. ఇంట్లో పేరెంట్స్ లేని సమయం చూసుకొని అత్యాచారం చేయబోయాడు. కాగా.. అన్న చేస్తున్న పనికి తొలుత కంగారుపడిన ఆ యువతి తర్వాత తేరుకుంది. తన మానాన్ని కాపాడుకునేందుకు సోదరుడిపై దాడి చేసింది. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సతీ మోహల్ల ప్రాంతానికి చెందిన దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి కుమారుడు దీపక్ రాజ్ పూత్  కంప్యూటర్ కోర్సు చేస్తున్నాడు. కుమార్తె చదువుకుంటోంది. కాగా.. ఇటీవల దీపక్ తల్లిదండ్రులు వారి అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో దీపక్, ఆయన సోదరి మాత్రమే ఉన్నారు.

కాగా.. మంగళవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న చెల్లెలిపై దీపక్ కన్నేశాడు. ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. కాగా.. సోదరుడు చేస్తున్న పనిని యువతి అడ్డుకుంది. తనను తాను రక్షించుకోవడానికి సోదరుడిపై కత్తితో దాడి చేసింది.

అనంతరం అక్కడి నుంచి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లిపోయింది. అక్కడ తన సోదరుడిపై తాను దాడి చేసినట్లు చెప్పింది. ఆమె చెప్పిన సమాచారం తో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోగా.. దీపక్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

అతనిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా.. తన సోదరుడు తనపై అత్యాచారానికి ప్రయత్నించడంతోనే తాను ఇలా చేశానని యువతి చెప్పడం గమనార్హం. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.