గుట్కాకు బానిసైన బాలిక .. టీచర్ అవమానించారని..
ఉత్తరప్రదేశ్‌లో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. 17 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అసలేం జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఓ దారుణమైన ఘటన వెలుగు చూసింది. మహోబాలో గుట్కాకు బానిసైన 17 ఏళ్ల యువతి ఆత్మహత్య పాల్పడింది. ఏం జరిగిందంటే.. స్కూల్లో టీచర్ విద్యార్థిని బ్యాగులో గుట్కా పట్టుకోవడంతో ఆమె తండ్రిని పాఠశాలకు పిలిపించి, మీ కుమార్తె గుట్కాకు బానిసగా మారిందని విద్యార్థిని ఇంటికి పంపించారు. ఈ ఘటనను అవమానంగా భావించిన ఆ యువతి కొన్ని గంటల వ్యవధిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహోబాలోని కబ్రాయ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో గురువారం చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్లే.. వివేక్ నగర్ ప్రాంతంలో నివాసముంటున్న అమిత్ సాహు కిరాణా దుకాణం నడుపుతూ.. జీవనం సాగుతున్నాడు. అతని 17 ఏళ్ల కూతురు అంజలి గర్ల్స్ ఇంటర్ కాలేజీలో చదువుతోంది. విద్యార్థిని తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. తన కూతురు స్కూల్ టీచర్ బుధవారం నాడు తనకు ఫోన్ చేసి కాలేజీకి పిలిపించింది. అమిత్ మధ్యాహ్నం పాఠశాలకు చేరుకోగా.. అతని కుమార్తె బ్యాగ్‌లో గుట్కా ప్యాకెట్స్ కనిపించాయని ఉపాధ్యాయుడు చెప్పాడు. విచారణలో ఆమె గుట్కా తాగినట్లు , అది అలవాటుగా మారినట్టు తేలింది. ఆ తర్వాత టీచర్ తన కుమార్తెను తన ముందు తిట్టి.. ఆమెను ఇంటికి తీసుకెళ్లాలని, గుట్కా తినడం మానేసిన తర్వాత మాత్రమే ఆమెను పాఠశాలకు పంపండని తనకు సూచించినట్టు తెలిపారు. అనంతరం అమిత్ కూతురు అంజలితో తండ్రి ఇంటికి వచ్చాడు.
ఈ ఘటనతో మనస్థాపానికి గురైన అంజలి మేడమీద గదిలోకి వెళ్లి, కాసేపటి తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అంజలిని ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ప్రస్తుతం తమ కూతురు గుట్కా కారణంగానే ఆత్మహత్యకు పాల్పడిందా? లేక మరేదైనా జరిగిందా? అని కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. బాలిక ఆత్మహత్య చేసుకుందని కబ్రాయ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ వీరేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. ఖచ్చితమైన కారణం తెలియదు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అనంతరం పోస్టుమార్టం నిర్వహించారు. నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.