Uttar Pradesh : సీఎం యోగి ఆదిత్యనాథ్ మిషన్ శక్తి 5.0ను ప్రారంభించారు. మహిళల భద్రత, గౌరవం, స్వావలంబనకు ప్రాధాన్యత ఇస్తూ దీన్ని ప్రారంభించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.
Uttar Pradesh : మహిళల భద్రత, గౌరవం, స్వావలంబన కోసం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రచారం 'మిషన్ శక్తి-5.0'ను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. శనివారం రాజధాని లక్నోలోని లోక్‌భవన్ ఆడిటోరియంలో ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2017కు ముందు రాష్ట్రంలో ఆడపిల్లలకు భద్రత ఉండేదికాదని… కానీ ఇప్పుడు వాళ్ల దారిని వాళ్లే వేసుకుంటున్నారని ఆయన అన్నారు. మహిళల గౌరవం తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని సీఎం యోగి స్పష్టమైన సందేశం ఇచ్చారు.
ఏమిటీ మిషన్ శక్తి 5.0?
మిషన్ శక్తి 5.0 కాార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 1,647 పోలీస్ స్టేషన్లలో కొత్తగా ఏర్పాటు చేసిన మిషన్ శక్తి కేంద్రాలను సీఎం యోగి ప్రారంభించారు. ఈ సందర్భంగా "సశక్త్ నారీ, సమృద్ధ్ ప్రదేశ్" ఫోల్డర్, SOP పుస్తకాలను కూడా ఆవిష్కరించారు. మిషన్ శక్తి ఇప్పుడు మహిళా సాధికారతకు ఒక బలమైన గుర్తింపుగా మారిందని యోగి అన్నారు.
యూపీ పోలీసుల్లో 44 వేల మంది మహిళలు…
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2017 వరకు యూపీ పోలీసు శాఖలో కేవలం 10 వేల మంది మహిళలు మాత్రమే ఉండేవారని… కానీ ఈ రోజు 44 వేల మందికి పైగా మహిళా పోలీసులు సేవలు అందిస్తున్నారని ముఖ్యమంత్రి యోగి తెలిపారు. ప్రతి నియామకంలో 20 శాతం మహిళల భాగస్వామ్యం ఉండేలా చూస్తున్నామన్నారు. ఇటీవల జరిగిన 60,200 నియామకాల్లో 12 వేల మందికి పైగా మహిళలు ఉన్నారని సీఎం యోగి వెల్లడించారు.
విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం
విద్యా రంగంలో కూడా మహిళల భాగస్వామ్యం వేగంగా పెరుగుతోందని సీఎం యోగి తెలిపారు. గతంలో ఆడపిల్లలకు బూట్లు లేదా యూనిఫాంలు కూడా దొరికేవి కావని, కానీ ఈ రోజు ప్రతి బిడ్డకు రెండు యూనిఫాంలు, బూట్లు, బ్యాగ్, స్వెటర్, పుస్తకాలు ఇస్తున్నారని గుర్తుచేశారు. ఇది కాకుండా, కన్యా సుమంగళ యోజన, సామూహిక వివాహ పథకం కూడా లక్షలాది మంది ఆడపిల్లల జీవితాలను మార్చేశాయని యోగి పేర్కొన్నారు.
ప్రతి పథకం మహిళ పేరిటే…
కేంద్ర ప్రభుత్వ ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, మాతృ వందన యోజన, బేటీ బచావో-బేటీ పఢావో, స్వచ్ఛ భారత్ మిషన్ వంటి పథకాలు మహిళల జీవితాన్ని సులభతరం చేశాయని యోగి అన్నారు. యూపీలో గ్రామీణ భూ రికార్డులలో కోటి మందికి పైగా మహిళల పేర్లు నమోదు అయ్యాయన్నారు.
బ్యాంకింగ్ కరస్పాండెంట్ సఖి పథకం కింద 40,000 మంది మహిళలు కోట్ల రూపాయల లావాదేవీలు చేస్తున్నారని సీఎం యోగి తెలిపారు. అదేవిధంగా, పోషణ్ అభియాన్ ద్వారా 60,000 మంది మహిళలకు ఉపాధి లభిస్తోందన్నారు.
మహిళల జోలికి రావాలంటే నేరస్థుల్లో భయం
మహిళల భద్రత గురించి సీఎం మాట్లాడుతూ… 2024 నుంచి ఇప్పటివరకు 9,513 కేసుల్లో 12,271 మంది నేరస్థులను శిక్షించినట్టు చెప్పారు. బరేలీలో జరిగిన ఒక సంఘటనను ప్రస్తావిస్తూ, ఇప్పుడు నేరస్థులే పొరపాటున యూపీకి వచ్చామని క్షమాపణలు కోరుతున్నారని అన్నారు.
నవరాత్రుల వరకు మిషన్ శక్తిపై ప్రత్యేక ప్రచారం
మిషన్ శక్తి కింద మహిళల భద్రతకు సంబంధించిన హెల్ప్‌లైన్‌ను మరింత బలోపేతం చేస్తున్నట్టు సీఎం యోగి తెలిపారు. సెప్టెంబర్ 21న బైక్ ర్యాలీ, నవరాత్రుల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి బేబీరాణి మౌర్య, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
