Uttar Pradesh : చేనేత, వస్త్ర ఉత్పత్తుల తయారీలో గొప్ప వారసత్వం ఉన్న ఉత్తరప్రదేశ్‌కు 2030 నాటికి 2.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోనున్న ప్రపంచ వస్త్ర మార్కెట్‌లో బలమైన స్థానం సంపాదించే సత్తా ఉందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

Uttar Pradesh : రాష్ట్ర యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యంగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంత్ కబీర్ పేరుతో టెక్స్‌టైల్, అపెరల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు స్వయంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ప్రకటించారు. యూపీ అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ మెగా పార్క్ ఏర్పాటు చేయబోతున్నట్లు సీఎం వెల్లడించారు. 

యూపీలో టెక్స్ టైల్ పార్క్ పథకం

ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… చేనేత, వస్త్ర ఉత్పత్తుల తయారీలో యూపీకి గొప్ప వారసత్వం ఉందన్నారు. 2030 నాటికి 2.3 ట్రిలియన్ డాలర్లకు ప్రపంచ వస్త్ర మార్కెట్‌ చేరనుంది… ఇందులో బలమైన స్థానం సంపాదించే సత్తా యూపీకి ఉందని అన్నారు. “శ్రమ, సరళత, స్వావలంబన అనే సంత్ కబీర్ ఆదర్శాల నుండి ప్రేరణ పొందిన ఈ ప్రాజెక్ట్ సంప్రదాయం, ఆధునికత మధ్య సమతుల్యం సాధిస్తూ పెట్టుబడులు, ఉత్పత్తి, ఉపాధికి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది” అని ఆయన అన్నారు.

భారత టెక్స్ టైల్ రంగంలో యూపీ వాటా ఎంత?

అధికారిక డేటా ప్రకారం భారతదేశంలోని అగ్రశ్రేణి టెక్స్‌టైల్, అపెరల్ ఎగుమతిదారులలో ఉత్తరప్రదేశ్ ఒకటి. 2023-24లో రాష్ట్రం 3.5 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది... ఇది దేశం మొత్తం టెక్స్‌టైల్ ఎగుమతులలో 9.6%. ఈ రంగం రాష్ట్ర జీడీపీకి 1.5% దోహదం చేస్తుంది, దాదాపు 22 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోంది. వారణాసి, మౌ, భదోహి, మీర్జాపూర్, సీతాపూర్, బారాబంకి, గోరఖ్‌పూర్, మీరట్‌లోని సాంప్రదాయ క్లస్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

టెక్స్ టైల్ పార్క్స్ ఏర్పాటుకు వడివడిగా చర్యలు

ఇప్పటివరకు, ఇన్వెస్ట్‌మెంట్ సారథి పోర్టల్‌లో 659 ప్రతిపాదనలు అందాయి, వీటికి 1,642 ఎకరాల భూమి అవసరం. ఈ ప్రతిపాదనల ద్వారా రూ. 15,431 కోట్ల పెట్టుబడులు రానుండగా, సుమారు 1,01,768 ఉద్యోగాలు వస్తాయని అంచనా. ప్రతి పార్క్ కనీసం 50 ఎకరాలలో ఉంటుంది, ఇందులో బటన్లు, జిప్పర్లు, ప్యాకేజింగ్, వేర్‌హౌసింగ్ వంటి అనుబంధ పరిశ్రమల సౌకర్యాలతో పాటు కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ కూడా ఉంటుంది.

ఈ పథకాన్ని పీపీపీ మోడల్ ద్వారా లేదా ఒక నిర్దిష్ట నోడల్ ఏజెన్సీ ద్వారా అమలు చేస్తారు. ప్రభుత్వం రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా వంటి ప్రాధాన్యత మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. త్వరితగతిన అమలు చేయడానికి భూమి గుర్తింపు, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఇదిలావుంటే పవర్‌లూమ్ నేత కార్మికులతో నేరుగా మాట్లాడి వారి ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని, ఆదాయాలను పెంచాలని, సాంప్రదాయ వస్త్ర పరిశ్రమను బలోపేతం చేయాలని అధికారులను సీఎం యోగి ఆదేశించారు. ప్రభుత్వం ఇప్పటికే నేత కార్మికులకు సబ్సిడీపై విద్యుత్ అందిస్తోందని, సౌరశక్తిని కూడా అనుసంధానించే అవకాశాలను అన్వేషించాలని ఆయన నొక్కి చెప్పారు. “నేత కార్మికులు కష్టానికి, సంప్రదాయానికి ప్రతీక. వారి చేతితో తయారు చేసిన వస్త్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. వారికి మద్దతు ఇవ్వడం మన కర్తవ్యం” అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

సంత్ కబీర్ టెక్స్‌టైల్, అపెరల్ పార్క్ పథకం భారీ పెట్టుబడులు, ఉద్యోగాలను తీసుకురావడమే కాకుండా ఈ రంగంలో ఉత్తరప్రదేశ్‌ను గ్లోబల్ హబ్‌గా నిలబెడుతుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విశ్వాసం వ్యక్తం చేశారు.