తన వద్ద పనిచేసే సిబ్బందితో మంత్రి చెప్పులు తుడిపించుకున్న సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..  ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఖుషినగర్‌లో బుద్ద పీజీ కళాశాలలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి మంత్రి రాజేంద్ర ప్రతాప్‌ సింగ్‌ హాజరయ్యారు. 

కార్యక్రమం అనంతరం తిరిగివెళుతుండగా ఆయన చెప్పులపై పడ్డ మట్టి, నీళ్లను సిబ్బంది టవల్ తో శుభ్రం చేశారు. ఈఘటనను అక్కడే ఉన్న మీడియావాళ్లు కవర్ చేయడంతో వైరల్ గా మారింది.

చెప్పులు తుడిపించుకోవడంపై మంత్రిని వివరణ కోరగా.. 'నాకేం గుర్తు లేదు. నా చెప్పులు ఎవరూ తుడవలేదు' అని బదులిచ్చారు. వెంట ఉన్న ఓ అధికారి ఈ ఘటనపై మాట్లాడుతూ 'మంత్రి గారు తన చెప్పులను తానే శుభ్రం చేసుకున్నారు. ఆయన ఎర్రని గుడ్డతో తుడుచుకోవడం నేను చూశాను' అంటూ మంత్రిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. 

దీనికి సంబంధించి ఫోటోలు వైరల్‌ అవ్వడంతో, ఒక్కసారిగా దుమారం చెలరేగింది. ఓ మంత్రి అయ్యుండి సిబ్బందితో ఇలా ప్రవర్తిస్తారా? అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో మంత్రి మరోసారి ఈ ఘటనపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.  తన చెప్పులు శుభ్రం చేయమని సిబ్బందిని తాను అడగలేదని.. వాళ్లే చేశారని చెప్పుకొచ్చారు.