ఉత్త‌రాఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో నేటి నుంచి బీజేపీ (bjp) మెగా ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించ‌నుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్ర‌చారంలో పాల్గొననున్నారు.

Utharakhand Election News 2022 : ఉత్త‌రాఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో నేటి నుంచి బీజేపీ (bjp) మెగా ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించ‌నుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్ర‌చారంలో పాల్గొననున్నారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌తో (manoharlal kattar) రాష్ట్ర వ్యాప్త ప్ర‌చారం ప్రారంభించి, బహిరంగ సభలను నిర్వహించనున్నారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ (jairam takur) 500 మందితో ర్యాలీలో పాల్గొన‌నున్నారు. 

‘‘భారత ఎన్నికల సంఘం (ECI) మార్గదర్శకాల ప్రకారం తాము భౌతిక‌, వ‌ర్చువ‌ల్ సమావేశాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాము. నేటి నుంచి మా స్టార్ క్యాంపెయినర్లందరూ వీటిలో ప్రసంగించడం ప్రారంభిస్తారు’’ అని బీజేపీకి చెందిన ఓ సీనియ‌ర్ నాయ‌కుడు ఓ మీడియా సంస్థతో తెలిపారు. వర్చువల్ ర్యాలీల కోసం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేసింది. ఆ పార్టీ విడుద‌ల చేసిన వివ‌రాల ప్ర‌కారం.. ఉత్తరాఖండ్‌లోని ప్రతీ నియోజకవర్గంలో 15 ఎల్ఈడీ (led screens)స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు వీటిని వీక్షించ‌డానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

ఉత్తరాఖండ్‌లో 60కి పైగా సీట్లను కైవసం చేసుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. వారం కింద‌ట ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం బీజేపీ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, నితిన్ గడ్కరీ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లతో పాటు మ‌రి కొంత మంది నాయ‌కులు కూడా ఈ ప్రచారాల్లో పాల్గొంటారు. 

ఉత్త‌రాఖండ్ ఎన్నిక‌ల కోసం ఇండియా టీవీ (india tv) ఇటీవ‌ల నిర్వ‌హించిన ఒపీనియ‌న్ పోల్స్ లో ఈ సారి కూడా బీజేపీయే ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. 21 డిసెంబర్ 2021 నుండి 9 జనవరి 2022 వరకు జన్ కీ బాత్ (jan ki bath) పేరిట నిర్వహించిన ఈ ఒపీనియన్ పోల్‌లో 18 నుండి 45 ఏళ్లు పైబడిన అన్ని వయసుల వారు పాల్గొన్నారు. 5000 మంది తో నిర్వహించిన ఈ పోల్‌లో ఉత్తరాఖండ్‌లో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తేలింది. ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఇక్కడ బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పోల్స్ ఫలితాల ప్రకారం 70 సీట్లున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బీజేపీకి 34 నుంచి 38 సీట్లు వస్తాయని తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ (congress) 24 నుంచి 33 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ (aam admi party) కూడా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. 2 నుంచి 6 సీట్లు ఆయన ఖాతాలోకి వెళ్లే ఛాన్స్ ఉంది. స్వతంత్రులు కూడా 2 సీట్ల వరకు గెలుపొందవచ్చు.