ప్రముఖ శాస్త్రీయ సంగీతకారుడు, సితార్ విధ్వాంసుడు ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. సితార్, సుర్‌బహర్‌లను వాయించడంలో ఇమ్రత్ ఖాన్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆయన కుటుంబానికి 400 ఏళ్ల సంగీత చరిత్ర ఉంది.. సితార్‌గా పిలిచే సుర్‌బహర్‌ వాయిద్య పరికరాన్ని వీరి కుటుంబమే తయారు చేసింది. తన జీవితాన్ని సితార్‌ వాయించేందుకే అంకితం చేశారు. సంగీత ప్రపంచానికి ఆయన అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం గతేడాది పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.

అయితే తన ప్రతిభను ప్రభుత్వం ఆలస్యంగా గుర్తించిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన అవార్డును తిరస్కరించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అమెరికాలోని మిస్సౌరి సెయింట్ లూయిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో నిన్న అర్థరాత్రి గుండెపోటుకు గురై ఇమ్రత్ ఖాన్ తుదిశ్వాస విడిచారు.