Delhi: దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఆర్థికవేత్త‌ రఘురామ్ రాజన్ వంటి ఆర్‌బీఐ మాజీ గవర్నర్లు, ఆర్థిక నిపుణులతో ప్రధాని న‌రేంద్ర మోడీ క్లోజ్డ్ డోర్ మీటింగ్‌కు పిలవాలని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు పీ. చిదంబరం అన్నారు. 

former finance minister P Chidambaram: దేశంలో గ‌త కొంత కాలంగా చరిత్ర‌లో ఎన్న‌డులేని విధంగా రూపాయి ప‌త‌నం కొన‌సాగుతూనే ఉంది. దీంతో రానున్న రోజుల్లో భార‌త్ ఆర్థిక ఒత్తిడి ప‌రిస్థితుల్లోకి జారుకునే అవ‌కాశ‌ముంద‌ని ఆర్థిక‌వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వం త‌గిన చ‌ర్య‌లు తీసుకోక‌పోతే ప‌రిస్థితులు దారుణంగా మారుతాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్రతిప‌క్ష పార్టీలు ప్ర‌భుత్వ తీరుపై మండిప‌డుతున్నాయి. దేశ ప్ర‌యోజ‌నాల‌ను దృష్టి ఉంచుకుని భార‌తీయ రిజ‌ర్వు బ్యాంకు (ఆర్బీఐ) మాజీ గ‌వ‌ర్న‌ర్లు, ప్ర‌ముఖ ఆర్థిక వేత్త‌ల‌తో రూపాయి ప‌త‌నం అడ్డుకోవ‌డం, ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌రింత దిగ‌జార‌కుండా చ‌ర్య‌లు తీసుకోవడానికి చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి పిలుపునిస్తున్నాయి. 

గురువారం డాలర్‌తో పోలిస్తే 83.20ల‌కు పడిపోయిన రూపాయి పరిస్థితిపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే ప్రముఖ ఆర్థిక‌ నిపుణుల బృందంతో క్లోజ్డ్ డోర్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర‌ మాజీ ఆర్థిక మంత్రి పీ.చిదంబరం అన్నారు."దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఆర్థికవేత్త‌ రఘురామ్ రాజన్ వంటి ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌లతో ప్రధాని న‌రేంద్ర మోడీ క్లోజ్డ్ డోర్ మీటింగ్‌కు పిలవాలి" అని చిదంబరం సూచించారు. అన్నింటికంటే దేశ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అయితే, బీజేపీకి చెందిన అమిత్ మాల్వియా దీనిని కొట్టిపారేశారు. 

రూపాయి ప‌త‌నం, ఆర్థిక ప‌రిస్థితుల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డానికి పీ.చిదంబ‌రం సూచించిన ఆర్థిక మేధావుల బృందంలో డాక్టర్ సీ. రంగరాజన్, డాక్టర్ వైవీ రెడ్డి, డాక్టర్ రాకేష్ మోహన్, డాక్టర్ రఘురామ్ రాజన్, మాంటెక్ సింగ్ అహ్లువాలియాలు ఉన్నారు. వీరంతా కూడా యూపీఏ హయాంలో కీలకమైన పదవులు నిర్వహించిన ఆర్థికవేత్తలు. రంగరాజన్, వైవీ రెడ్డి, రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్‌లుగా, రాకేష్ మోహన్ డిప్యూటీ గవర్నర్‌గా, మాంటెక్ సింగ్ ఇప్పుడు రద్దయిన ప్రణాళికా సంఘానికి డిప్యూటీ ఛైర్మన్‌గా ప‌నిచేశారు. 

"రూపాయి విలువ నిరంతరం క్షీణించడం పట్ల ప్రభుత్వం నిస్సహాయంగా కనిపిస్తోంది. క్షీణిస్తున్న రూపాయి ద్రవ్యోల్బణం, కరెంట్ ఖాతా లోటు, వడ్డీ రేట్లకు పర్యవసానంగా ఉంది" అని చిదంబరం ట్వీట్ చేస్తూ, ప్రభుత్వానికి దేశంలో అందుబాటులో ఉన్న ఆర్థిక‌వేత్త‌ల‌ జ్ఞానం, అనుభవాల‌ను ఉప‌యోగించుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. కాగా, మాజీ ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ రఘురామ్ రాజన్.. అనేక మార్లు బీజేపీ ప్రభుత్వం పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాలు ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు చేటు చేస్తాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే, కొన్ని నెలల క్రితం, భారతదేశ ఆర్థిక పరిస్థితి శ్రీలంక, పాకిస్తాన్‌ల వలె అధ్వాన్నంగా లేదంటూనే.. జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

అయితే, "అయాచిత సలహా ఇవ్వడానికి మీకు కొంత ధైర్యం ఉంది. మీరు మాట్లాడే మేధోపరమైన మద్దతు భారతదేశాన్ని "ఫ్రాగిల్ ఫైవ్"కి తీసుకువెళ్లింది. కొంతమంది వ్యక్తులు 2012-14 మధ్యకాలంలో FinMin, PlanCommలలో ముఖ్యమైన స్థానాలను ఆక్రమించుకోవాలని సూచించారు. ఈ కాలంలో విధాన పక్షవాతం, తక్కువ వృద్ధి …," అని మాల్వియా పేర్కొన్నారు. కాగా, రూపాయి పనితీరు గురించి ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నించగా, రూపాయి పతనం కాకుండా డాలర్ బలపడడం వంటి పరిస్థితిని చూడలేదని ఆమె అన్నారు. "డాలర్ నిరంతరం బలపడుతోంది. కాబట్టి సహజంగానే, బలపడుతున్న డాలర్‌కు వ్యతిరేకంగా అన్ని ఇతర కరెన్సీలు పని చేస్తున్నాయి. నేను సాంకేతికత గురించి మాట్లాడటం లేదు, అయితే ఇది వాస్తవం ఏమిటంటే భారతదేశం రూపాయి బహుశా ఈ డాలర్ రేటు పెరగడాన్ని తట్టుకుని ఉండవచ్చు... భారత రూపాయి అనేక ఇతర ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీల కంటే మెరుగైన పనితీరు కనబరిచింది" అని సీతారామన్ అన్నారు.