కాశ్మీర్ అంశంపై భారత్-పాక్‌ల మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మంగళవారం ఢిల్లీలో భారత్-అమెరికా సంయుక్త మీడియా సమావేశంలో ఆయన జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు. భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలకు కారణం కాశ్మీరేనని ఆయన వ్యాఖ్యానించారు. తమకు భారత్ ఎంతో పాకిస్తాన్ కూడా అంతేనని ట్రంప్ స్పష్టం చేశారు.

Also Read:మళ్లీ నేనే గెలుస్తా, మార్కెట్లు లేస్తాయ్: భారతీయ కంపెనీల సీఈఓలతో ట్రంప్

ప్రతీ అంశాన్ని రెండు వైపులా చూడాలని.. అయితే భారత్ ఎంతో ధైర్యమైన దేశమన్నారు. ప్రధాని మోడీ ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొగలరని అదే సమయంలో టెర్రరిజంపై పోరులో తనను మించిన వారు లేరని ట్రంప్ స్పష్టం చేశారు.

కాశ్మీర్‌పై ఇరుదేశాల వాదనలను పూర్తిగా వినాలని ఆయన సూచించారు. కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై మాట్లాడటానికి ఏం లేదని, అది పూర్తిగా భారత అంతర్గత విషయమని ట్రంప్ తేల్చి చెప్పారు. 

సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై తాను మోడీతో మాట్లాడలేదని అయితే మత స్వేచ్ఛను కాపాడాలని మోడీకి చెప్పానని అన్నారు. అయితే ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు తన దృష్టికి వచ్చాయని ట్రంప్ స్పష్టం చేశారు.

Also Read:సీఏఏపై ఇలా: ఢిల్లీ అల్లర్లపై తెలివిగా తప్పించుకున్న ట్రంప్

మోడీ మాటలపై తనకు నమ్మకం ఉందన్న ఆయన.. ఢిల్లీ ఘటనలు భారతదేశ అంతర్గత విషయమని అగ్రదేశాధినేత వెల్లడించారు. ఇండియా ఇంతగా అమెరికాను ఎప్పుడూ అభిమానించలేదన్నారు. అహ్మదాబాద్‌లో ఇచ్చిన ఘనస్వాగతాన్ని తాను జీవితంలో ఎప్పటికీ మరచిపోనని ట్రంప్ తెలిపారు.

భారత్‌తో 3 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామన్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. మంగళవారం భారతీయ మీడియాతో ట్రంప్ ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత ఇంధన రంగంలో భారత్‌లో పెట్టుబడులు పెరిగాయన్నారు.