ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో ఒక అనాగరిక సంఘటన జరిగింది. ఒక మహిళా ఉపాధ్యాయురాలు తన లంచ్ బాక్స్‌లో మూత్రాన్ని గుర్తించింది. దీనికి బాధ్యుడిగా తన సహోద్యోగిపై ఆరోపణలు చేసింది. ముజాఫర్ నగర్ జిల్లాలోని చరత్వాల్ డెవలప్‌మెంట్ బ్లాక్ లోని హబత్పూర్ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన జరిగింది.

నిందితుడిగా ఆరోపిస్తున్న ఉపాధ్యాయుడిపై ఇప్పటికే దోపీడి, వేధింపులకు సంబంధించిన ఆరోపణలు వున్నాయి. తాజాగా మహిళా టీచర్ లంచ్ బాక్స్‌లో మూత్రం బయటపడటంతో బాధితురాలు వెంటనే విషయాన్ని గ్రామ పంచాయతీ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. తనను మిగిలిన బోధనా సిబ్బందితో కలిసి నిందితుడు వేధిస్తున్నాడని ఆమె ఆరోపించింది. దీంతో పంచాయతీ పెద్దలు మహిళా టీచర్‌కు క్షమాపణలు చెప్పాల్సిందిగా ఉపాధ్యాయుడిని ఆదేశించారు. 

మరోవైపు బాధితురాలిని పాఠశాల బోధనా సిబ్బంది ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారన్నది తెలియరాలేదు. నిందితుడు మీద కానీ, బోధనా సిబ్బందిపైనా సదరు మహిళా టీచర్ ఎలాంటి చట్టపరమైన చర్యలకు దిగలేదు. అయితే తనను మాత్రం మరో పాఠశాలకు బదిలీ చేయాల్సందిగా ఆమె పంచాయతీ పెద్దలకు విజ్ఞప్తి చేసింది.