కరోనా కారణంగా గతేడాది జీవితంలో ఎంతో కోల్పోయిన వారున్నారు. ఆత్మీయులను దూరం చేసుకోవడంతో పాటు వ్యక్తిగతంగా, వృత్తిగతంగాను ఇబ్బందులు పడ్డారు. వేతనాల కోతతో పాటు ప్రమోషన్లు ఆగిపోయిన వారు, విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఇలా ఎందరో కలలు కల్లలయ్యాయి.

వీరిలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు కూడా వున్నారు. అయితే కోవిడ్ కారణంగా పరీక్షలకు హాజరుకాలేకపోయారు. ఈ క్రమంలో యూపీఎస్సీ సివిల్స్ సర్వీస్ అభ్యర్థులకు భారీ ఊరట లభించింది.

కరోనా కారణంగా గతేడాది సివిల్స్ పరీక్షలకు హాజరుకాలేకపోయిన వారికి అదనపు అవకాశం ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. మహమ్మారి వల్ల చివరి ప్రయత్నం తప్పిపోయిన అభ్యర్థులకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీం కోర్టుకు తెలిపింది.   

రచనా సింగ్ అనే సివిల్స్ అభ్యర్థి పిటిషన్‌ను విచారించిన సుప్రీం..2020లో చివరి ప్రయత్నం చేస్తోన్న అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం, యూపీఎస్సీ కమిషన్‌కు గతేదాడి సెప్టెంబర్‌లో సూచించింది.

అయితే, వారికి మరో అవకాశం ఇచ్చేందుకు సుముఖంగా లేమని జనవరిలో కేంద్రం చెప్పింది. ఇది ప్రభుత్వ పరీక్షల వ్యవస్థపై ప్రభావం చూపుతుందని తెలిపింది. అయితే తాజాగా మనసు మార్చుకున్న కేంద్రం ఆ నిర్ణయంలో మార్పు చేసుకుంటూ..మరో అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించింది.   

కోవిడ్ విజృంభణ కారణంగా గతేడాది మేలో జరగాల్సిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను అక్టోబర్‌ 4న నిర్వహించారు. దానికి 4,86,952 మంది అభ్యర్థులు హాజరయ్యారని కేంద్రం తెలిపింది. ఈ జనవరిలో మెయిన్స్ పరీక్షలు కూడా పూర్తయ్యాయి. 2021లో జరగనున్న సివిల్స్‌ పరీక్షలకు ఫిబ్రవరి 10 నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం వుంది.