Asianet News TeluguAsianet News Telugu

పామును దొరకబట్టి మెడన వేసుకుని ఊరేగాడు.. చివరకు ఆ పాము కాటుకే బలయ్యాడు..!

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి పొరుగింటిలో పామును దొరకబట్టి మెడలో వేసుకుని ఊరేగాడు. ఆ తర్వాత దానిని ఓ బాలిక మెడలోనూ వేశాడు. ఆ పాము పట్టుకున్న సుమారు రెండు గంటల తర్వాత పాము కాటుకు గురయ్యాడు. రకరకాల వన మూలికలతో వైద్యానికి ప్రయత్నించి ప్రాణం కోల్పోయాడు.
 

UPs snake catcher died after bitten by it
Author
First Published Aug 22, 2022, 1:50 PM IST

లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన దేవేంద్ర మిశ్రా పాములు పట్టడంలో అందె వేసిన చేయి. సర్పాలకు ఆయన బెదరడు. వాటి వెంటబడి పట్టుకుంటాడు. ఇంట్లోకి పాము వచ్చిందంటే ఆ ఊరిలోని వారందరికీ మొదటగా గుర్తుకు వచ్చేది దేవేంద్ర మిశ్రానే. పాము ముప్పును తప్పించి అవలీలగా దాన్ని దూరంగా వదిలిపెట్టేవాడు. అప్పుడప్పుడు వాటితో తమాషాగా ఆడుకునేవాడు కూడా. 

ఇటీవలే ఆ ఊరిలో ఓ ఇంటిలోకి పాము వచ్చింది. దీంతో వెంటనే దేవేంద్ర మిశ్రాకు సమాచారం ఇచ్చారు. రమ్మని కబురు పంపారు. ఆయన కూడా వెంటనే స్పాట్‌కు వెళ్లాడు. ఆ పామును ఎంత మాత్రం బెరుకు లేకుండా పట్టుకున్నాడు. అది విషసర్పంగా గుర్తించారు. దాన్ని పట్టుకున్న తర్వాత దూరంగా వదిలిపెట్టకుండా తన మెడలో వేసుకున్నాడు. తన మెడలో వేసుకుని ఊరంతా ఊరేగాడు. అంతేకాదు, ఓ చిన్నారి బాలిక మెడలో కూడా వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కానీ, ఆ పాము దేవేంద్ర మిశ్రాను కాటేసింది. విషపూరిత ఆ సరీసృపాన్ని పట్టుకున్నాక సుమారు రెండు గంటల తర్వాత ఆయనకు కాటు వేసింది. పాము కాటేసిన విషయం తెలుసుకున్న దేవేంద్ర మిశ్రా నేరుగా హాస్పిటల్ వెళ్లకుండా రకరకాల వనమూలికలను తీసుకున్నాడు. ఆ పాము కాటుకు వన మూలికల ద్వారా వైద్యం చేయడానికి పూనుకున్నాడు. కానీ, ఆ వనమూలికలు పాము కాటుకు విరుగుడుగా పని చేయలేవు. దీంతో కొన్ని గంటల తర్వాత దేవేంద్ర మిశ్రా ప్రాణం వదిలినట్టు గ్రామస్తులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios