డెంగ్యూ, మలేరియాలను వ్యాపింపజేసే దోమల లార్వాను నాశనం చేయాలనే ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన మొరదాబాద్ జిల్లా అధికారులు చేపలను ఆయుధంగా వినియోగిస్తున్నారు. గంబూసియా చేపలు ఆ దోమల లార్వాను నియంత్రిస్తాయని పేర్కొంటూ వాటిని ఆ జిల్లాలోని పలు చెరువుల్లో వదిలిపెడుతున్నారు. ఈ విధానం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

లక్నో: డెంగ్యూ, మలేరియాలతో సతమతమవుతున్న ఆ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి అక్కడి అధికారులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గంబూసియా చేపలను కొనుగోలు చేసి చెరువుల్లో పెంచుతున్నారు. ఇతర చెరువుల్లోనూ వదలిపెడుతున్నారు. ఈ విచిత్రమైన నిర్ణయం ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో అమలవుతున్నది. ఇంతకీ చేపలకు డెంగ్యూ, మలేరియాలకు సంబంధమేంటనే కదా మీ డౌట్.. ఆ అధికారుల వివరణ ఇలా ఉన్నది.

గంబూసియా చేపలతో డెంగ్యూ, మలేరియాలను వ్యాపింపజేసే దోమల లార్వాను నియంత్రించవచ్చని, తద్వర ఈ రెండు వ్యాధులను అదుపు చేయవచ్చనేది అక్కడి మత్స్యశాఖ అధికారుల భావన. అందుకే మూడు పెద్ద చెరువుల నుంచి గంబూసియా చేపలను ఇతర కొలనులు, చెరువలకు తరలిస్తున్నారు.

ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ హెచ్‌సీ వర్మ మాట్లాడుతూ, ‘జిల్లా మెజిస్ట్రేట్ మమ్ములను 10వేల నుంచి 20 వేల చేపలను కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత వాటిని జిల్లాలో కనీసం 20 చెరవుల్లో వదిలిపెట్టి రావాలని చెప్పారు’ అని పేర్కొన్నారు.

గత నెల నుంచి డెంగ్యూ, మలేరియా వ్యాధులతో ఉత్తరప్రదేశ్ వార్తల్లో కొనసాగుతున్నది. అత్యధిక సంఖ్యలో ఈ కేసులు రాష్ట్రంలో నమోదవుతున్నాయి. ఆరోగ్య శాఖ అధికారుల డోర్ టు డోర్ సర్వే చేస్తున్నారు. దోమల లార్వా కనిపించిన చోట సదరు నివాసులకు నోటీసులు పంపుతున్నారు. గంబూసియా చేపలు నిజంగానే లార్వాను నాశనం చేస్తాయా? ఈ విధానం డెంగ్యూ, మలేరియాలను అరికడుతుందా? అనేదానిపై చర్చ జరుగుతున్నది.