ఉత్తరప్రదేశ్‌లో 21 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని ఇద్దరు దుండగులు బహిరంగంగా నడి రోడ్డుపై కాల్చి చంపారు. ఆ యువతి స్పాట్‌లోనే ప్రాణం వదిలింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు యోగి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ కాలేజీ విద్యార్థినిని ఇద్దరు దుండగులు పల్సర్ బైక్ పై వచ్చి కాల్చి చంపారు. ఈ ఘటన పట్టపగలే నడి రోడ్డుపై సోమవారం జరిగింది. ఆ దుండగులు గన్‌ను అక్కడే స్పాట్‌లో పడేసి పారిపోయారు. ఈ ఘటన జలాన్ జిల్లాలో పోలీసు స్టేషన్ నుంచి 200 మీటర్ల దూరంలో చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్లు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, మీడియా సమక్షంలోనే అతీక్ అహ్మద్ దారుణ హత్య జరిగిన రోజుల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
బీఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్ 21 ఏళ్ల రోషిని అహిర్వార్ రామ్ లఖాన్ పటేల్ మహావిద్యాలయలో పరీక్ష రాసి ఉదయం 11 గంటల సమయంలో ఇంటికి తిరుగుపయానమైంది. అదే సమయంలో ఇద్దరు దుండగులు బజాజ్ పల్సర్ బైక్ పై ఆమె వద్దకు వచ్చారు. కంట్రీ మేడ్ పిస్టల్‌తో ఆమెపై కాల్పులు జరిపారు. ఆమె తలపై కాల్పులు జరపడంతో రోషిని స్పాట్‌లోనే మరణించింది. స్థానికులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ, వారు పిస్టల్ స్పాట్‌లోనే వదిలిపెట్టి పారిపోయారు.
యువతి తల్లిదండ్రులు రాజ్ అహిర్వార్ అనే వ్యక్తికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Also Read: సమగ్ర కుల గణన చేపట్టండి.. : ప్రధాని మోడీకి మల్లికార్జున ఖర్గే లేఖ
ఆ యువతి మరణించిన స్పాట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్ సిస్టమ్ గురించి ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
రాష్ట్రీయ జనతా దళ్ ఓ వీడియోను ట్వీట్ చేసి యూపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. గోదీ మీడియా, బీజేపీ తోడేళ్లు ఈ చావును కూడా వేడుక చేసుకుంటాయా? అంటూ ప్రశ్నించింది. అతీక్ అహ్మద్ హత్యను పరోక్షంగా పేర్కొంటూ ఈ కామెంట్ చేసింది. అతీక్ అహ్మద్ హత్యపై మీడియా విస్తృత కవరేజ్ ఇచ్చింది. పోలీసుల కస్టడీలో ఉండగానే అతీక్ హత్య జరిగినప్పటికీ యోగి ప్రభుత్వంపై పొగడ్తలు కురిపించింది.
