సుపారీ ఇచ్చి ఓ వ్యక్తి కన్న కూతురినే అతి కిరాతకంగా హత్య చేయించాడు. కూతురు వేరే మతస్థుడిని ప్రేమించిందనే కారణంతో ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

బెల్ ఘట్ ప్రాంతానికి చెందిన రంజనా యాదవ్ వేరే మతానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ఆమె ప్రేమను తండ్రి కైలాష్ యాదవ్ నిరాకరించాడు. సదరు యువకుడితో మాట్లాడవద్దంటూ ఆంక్షలు విధించాడు. అయితే.. రంజన తండ్రి మాటను పట్టించుకోలేదు. దీంతో.. మాట వినని కూతురు తనకు అవసరం లేదని కైలాష్ భావించాడు.

ఈ క్రమంలోనే రూ.1.5లక్షల సుపారీ ఇచ్చి ఓ కాంట్రాక్ట్ కిల్లర్ ను నియమించారు. ఫిబ్రవరి 3న పథకం ప్రకారం.. రంజనను ఆమె తండ్రి ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడకు వెళ్లిన తర్వాత యువతి అన్నయ్య అజిత్ యాదవ్, బావ సత్య ప్రకాశ్ యాదవ్ సహాయంతో యువతి, కాళ్లు, చేతులు కట్టేశారు. అనంతరం కిల్లర్ ఆమెపై పెట్రోలు పోసి కాల్చేశాడు. 

తర్వాతి రోజు దంగట పోలీస్ స్టేషన్ పరిధిలో సగం కాలి ఉన్న యువతి మృతదేహాన్ని గుర్తించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ కెమేరాల ఆధారంగా యువతి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆయన తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. హత్యకు సహకరించిన వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.