భారత దేశంలో ఆడవారి రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని కొత్త చట్టాలు అమల్లోకి తీసుకువచ్చినా... దారుణాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా.. ఇలాంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. భార్య తనపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోలేదని  ఓ భర్త ఆమె ముక్కు కోసేసాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... యూపీకి చెందిన ముస్లిం మహిళకు ఇటీవల ఆమె భర్త ఫోన్లోనే త్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో... బాధితురాలు వెంటనే ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించింది.దీంతో... ఆమె బాధనంతటినీ విన్న పోలీసులు... ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ.. యువతి భర్త, అత్తమామలు విడాకులు వెనక్కి తీసుకోవాడానికి అంగీకరించలేదు.

దీంతో... బాధిత యువతి వెంటనే భర్తపై త్రిపుల్ తలాక్ కేసు పెట్టింది. ఆ కేసు వెనక్కి తీసుకోవాలని భర్త, అత్తమామలు ఆమెను బెదిరించారు. ఆమె అయినా వినిపించుకోకపోవడంతో దారుణంగా కొట్టి... బలవంతంగా ఆమె ముక్కు కోసేశారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

త్రిపుల్ తలాక్ నేరం కింద పరిగణిస్తూ... ఇటీవల కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు పార్లమెంట్ లో పాస్ అవ్వగా... దానికి రాష్ట్ర పతి ఆమోద ముద్ర వేశారు. దీనికి చట్ట రూపం దాల్చిన తర్వాత కూడా చాలా మంది తమ భార్యలకు  ట్రిపుల్ తలాక్ చెప్పి అనవసరంగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు.