కిచెన్ లో తినడానికి ఏమీ లేవనే కోపంతో.. ఓ వ్యక్తి కన్న కూతురిని, పని మనిషిని కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే.. జనూన్‌పూర్‌, బడీ ఖాస్‌ గ్రామానికి చెందిన ముంతాజ్‌ అలియాస్‌ సోను మానసిక పరిస్థితి సరిగా లేదు. సోమవారం అతడ్ని వైద్యునికి చూపించటానికి వారణాసిలోని ఆసుపత్రికి తీసుకెళుతుండగా వాహనంలోనుంచి కిందకు దూకి పారిపోయాడు. 

ఎప్పుడో సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. మంగళవారం ఆకలితో ఉన్న ముంతాజ్‌ వంటగదిలోకి వెళ్లి ఆహారం కోసం వెతికాడు. అక్కడ ఏమీ కనపించలేదు. దీంతో ఆగ్రహానికి గురయ్యాడు. వంట గదిలోని కత్తితో హాలులోకి వచ్చి కుటుంబసభ్యులపై దాడికి తెగబడ్డాడు. మొదట కూతురు హమైరా(7)పై దాడి చేశాడు. అనంతరం హమైరాను కాపాడటానికి వచ్చిన తన తల్లిపై కూడా దాడి చేశాడు.

ఆమె అరుపులు విన్న ముంతాజ్‌ భార్య, కుమారుడితో అక్కడికి రాగా వారిపై దాడి చేశాడు. అడ్డుకోవటానికి వచ్చిన మరో కుటుంబసభ్యున్ని, పాలు పోయటానికి వచ్చిన పాల మనిషిపై కూడా దాడికి పాల్పడ్డాడు. అనంతరం అతన్ని పట్టుకున్న ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గాయాలపాలైన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మృతి చెందిన హమైరా, పాల మనిషిని పోస్టుమార‍్టం నిమిత్తం తరలించారు. నిందితుడు ముంతాజ్‌ను అరెస్ట్‌ చేశారు.