లక్నో: ఆలుగడ్డ పొలం విషయంలో సోదరుల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించిన ఉత్తరప్రదేశ్ పోలీసాఫీసరును కాల్చి చంపారు. ఆ అధికారి ఆగ్రాకు చెందినవాడు. ఖండౌలీ పోలీసు స్టేషన్ సబ్ ఇన్ స్పెక్టర్ ప్రసాంత్ యాదవ్ కు ఇద్దరు సోదరుల మధ్య తలెత్తిన వివాదంపై ఫిర్యాదు అందింది. 

ఇద్దరు సోదరుల మధ్య తలెత్తిన వివాదంపై ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఆయన ఇతర పోలీసు అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లాడు. వివాదాన్ని పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం నెరిపే ప్రయత్నం చేశాడు. ఇద్దరు సోదరుల్లో ఒకని వద్ద రివాల్వర్ ఉంది. అతను ప్రశాంత్ యాదవ్ మెడపై కాల్పులు జరిపాడు. 

వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఎస్సై మృతి చెందాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. 

ఎస్సై మృతికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇస్తామని, రోడ్డుకు ప్రశాంత్ యాదవ్ పేరు పెడుతామని ఆయన చెప్పారు.