UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లో గురువారం మొదటి దశ ఎన్నికలు జరగనుండటంతో ఆయా ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం 412 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలకు చెందిన దాదాపు 50,000 మంది పారామిలటరీ సిబ్బందిని వివిధ ప్రాంతాల్లో మోహరించారు.
UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లో ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగున్నాయి. గురువారం మొదటి దశ ఎన్నికలు (UP polls phase I) జరగనుండటంతో ఆయా ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం 412 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలకు చెందిన దాదాపు 50,000 మంది పారామిలటరీ సిబ్బందిని (paramilitary security personnel) వివిధ ప్రాంతాల్లో మోహరించారు. రాష్ట్ర సరిహద్దులను పోలీసులు మూసివేశారు. రేపు పోలింగ్ జరగనున్న 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన నిఘా కొనసాగుతోంది.
“ముజఫర్‌నగర్(Muzaffarnagar), అలీఘర్ (Aligarh), మీరట్ (Meerut) లలో అత్యధిక పారా మిలటరీ బలగాలను మోహరించారు. ఒక్క మధురలో మాత్రమే 75 మంది పారామిలటరీ కాయ్‌లను మోహరించారు. మొత్తంగా ఈ నియోజకవర్గంలో 21,000 మందిని మోహరించారు”అని భద్రతా అధికారులు పేర్కొన్నారు. భద్రతా పరంగా సున్నితమైన ప్రాంతాలు కావడంతో అధికంగా బలగాలను మోహరిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద కూడా నిఘా పెంచినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. హర్యానా (Haryana), రాజస్థాన్ (Rajasthan) రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు మోహరించి.. వాహనాల నెంబర్లు, సంబంధిత వివరాలను నమోదుచేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య, పోలింగ్ అధికారులు, ఎన్నికల బృందాలు బుధవారం ఉదయం 7 గంటల నుండి అవసరమైన అన్ని ఎన్నికల సామగ్రిని సేకరిస్తున్నట్టు తెలిపారు.
“అంతటా బలగాల కదలిక ఉంటుంది, గట్టి భద్రత మధ్య ఓటింగ్ జరుగుతుంది. డ్యూటీ కార్డులు కేటాయించారు. 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయబడ్డాయి. ఓటింగ్ ముగిసిన తర్వాత మాత్రమే తెరవబడతాయి”అని అధికారులు తెలిపారు. పోలింగ్ బూత్‌లకు రెండు వందల మీటర్ల పరిధిలో అభ్యర్థులకు సంబంధించిన హోర్డింగ్‌లు, బ్యానర్లు, పోస్టర్లు కనిపిస్తే వెంటనే వాటిని తొలగిస్తారు. ఎన్నికల బూత్‌ల వద్ద, అభ్యర్థులు మూడు నుంచి నాలుగున్నర అడుగుల కంటే ఎక్కువ బ్యానర్‌లను ఉంచితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (election Model code of conduct) ను ఉల్లంఘించినట్లు పరిగణిస్తామని అధికారి తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దని ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు (governments of all the poll-bound states) మరోసారి ఆదేశాలు జారీ చేసినట్టు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. మొదటిదశలో గురువారం నాడు 58 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో షామ్లీ, మధుర, ఆగ్రా, ముజఫర్‌నగర్, బాగ్‌పట్, మీరట్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, హాపూర్, బులంద్‌షహర్, అలీగఢ్ లు ఉన్నాయి. యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు (UP Assembly Election 2022) జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుత అసెంబ్లీల గడువు మార్చి 14తో ముగుస్తుంది. బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య గట్టి పోరు ఉండనుందని ప్రస్తుత రాజకీయ పరిణమాలు గమనిస్తే తెలుస్తోంది.
