Asianet News TeluguAsianet News Telugu

UP Assembly Election 2022: నా కుమారుడికి టిక్కెట్ ఇవ్వండి.. లోక్‌స‌భ‌కు రాజీనామా చేస్తా!: బీజేపీ ఎంపీ

UP Assembly Election 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల్లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు మ‌యాంక్ జోషికి టిక్కెట్ ఇవ్వాల‌నీ, తాను లోక్‌స‌భ‌కు రాజీనామా చేయ‌డానికి సైతం సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు బీజేపీ పార్ల‌మెంట్ స‌భ్యులు రీటా బహుగుణ జోషి. 
 

UP polls: BJP's Rita Joshi seeks ticket for son, offers to resign from Lok Sabha
Author
Hyderabad, First Published Jan 19, 2022, 2:39 AM IST

UP Assembly Election 2022: వ‌చ్చే నెల‌లో దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ణిపూర్‌, గోవా, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు హీటు పెంచాయి. ఈ ఎన్నిక‌లు మినీ సంగ్రామాన్ని త‌ల‌పిస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. అన్ని ప్ర‌ధాన పార్టీలు రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్రచారాన్ని ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నాయి. విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లతో విరుచుకుప‌డుతుండ‌టంతో యూపీ రాజ‌కీయాలు కాక రేపుతున్నాయి. అయితే, మ‌ళ్లీ అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తున్న బీజేపీకి.. కీల‌క నేత‌లు క‌మ‌లాన్ని వీడుతుండ‌టం క‌ల‌వ‌రానికి గురిచేస్తున్న‌ది. ఇలాంటి ప‌రిస్థితులు నెల‌కొన్న త‌రుణంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న కుమారునికి టిక్కెట్ ఇవ్వాల‌నీ.. దానికి కోసం త‌న లోక్‌స‌భ ఎంపీ ప‌ద‌వికి సైతం రాజీనామా చేయ‌డానికి సైతం సిద్ధ‌మంటూ ప్ర‌క‌టించారు బీజేపీ పార్ల‌మెంట్ స‌భ్యులు రీటా బ‌హుగుణ జోషి.  ప్ర‌స్తుతం ఇది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

వివ‌రాల్లోకెళ్తే..  భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంట్ స‌భ్యులు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీనియర్ నాయకురాలు రీటా బహుగుణ జోషి మంగళవారం (జనవరి 18) రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో తన కుమారుడికి పార్టీ టిక్కెట్ ఇవ్వాల‌ని ఆ పార్టీని కోరింది. త‌న కుమారుడికి టిక్కెట్ కేటాయింపు కోసం తాను లోక్‌సభ స్థానానికి రాజీనామా చేయ‌డానికి సైతం సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు.  అయితే, ఆమె ఇలా వ్యాఖ్యానించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. ఒక్కో కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్ ఇవ్వాలని బీజేపీ పార్టీ నిర్ణయించ‌డ‌మేన‌ని తెలిసింది. రీటా బ‌హుగుణ జోషి ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ నుంచి లోక్‌సభకు ఎన్నిక‌య్యారు. రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో త‌న కుమారుడు మయాంక్ జోషికి టిక్కెట్ ఇవ్వాలని కోరుతూ ఆమె బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు లేఖ రాశారు.

ఈ విషయం గురించి రీటా బ‌హుగుణ జోషి మీడియాతో మాట్లాడుతూ..  త‌న కుమారుడు మయాంక్ జోషి 2009 నుంచి భార‌తీయ జ‌న‌తా పార్టీ కోసం ప‌నిచేస్తున్నాడ‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌డానికి ల‌క్నో నియోజ‌క‌వ‌ర్గం టికెట్ కోసం బీజేపీకి ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడ‌ని తెలిపారు. అయితే, బీజేపీ ఒక కుటుంబంలో ఒక్క‌రికి మాత్ర‌మే టిక్కెట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింద‌ని వెల్ల‌డించిన ఆమె.. త‌న కుమారుడి టిక్కెట్ కేటాయింపు కోసం తాను ప్ర‌స్తుత లోక్ స‌భ ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డానికి సైతం సిద్ధ‌మ‌ని తెలిపింది. "నేను ఈ ప్రతిపాదనను గురించి బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డాకు లేఖ రాశాను. నేను ఎల్లప్పుడూ బీజేపీ కోసం పని చేస్తూనే ఉంటాను. నా ప్రతిపాదనను అంగీకరించడం లేదా అంగీకరించకపోవడం పార్టీ ఎంచుకోవచ్చు. నేను ఎన్నికల్లో పోటీ చేయనని చాలా సంవత్సరాల క్రితమే ప్రకటించాను" అని రీటా బహుగుణ జోషి తెలిపారు.

కాగా, ఉత్తరప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10, 14, 20, 23, 27 మరియు మార్చి 3 మరియు 7 తేదీల్లో ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios