UP Assembly Election 2022: బీజేపీ ప‌చ్చి అబ‌ద్దాల కోరు అనీ, రాష్ట్ర అభివృద్దికి వారు చేసిందేమీ లేదంటూ స‌మాజ్ వాదీ అధినేత అఖిలేష్ యాద‌వ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ తుడిచిపెట్టుకు పోవ‌డం ఖాయ‌మ‌ని విమ‌ర్శించారు.  

UP Assembly Election 2022: ఉత్త‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఈ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌నతా పార్టీ (బీజేపీ)-స‌మాజ్ వాదీ (ఎస్పీ) పార్టీలు నువ్వా-నేనా అనే విధంగా ఎన్నిక‌ల ప్ర‌చారం కొన‌సాగిస్తున్న ముందుకు సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆదివారం నాడు రాష్ట్రంలో అత్యంత కీల‌కమైన‌, యాద‌వుల ప్రాబ‌ల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర విమర్శ‌లు గుప్పించారు. ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్ పై కూడా మండిప‌డ్డారు. 

ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం మూడో దశ పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తన కుటుంబంతో సహా ఇటావాలోని సైఫాయ్‌లో ఓటు వేశారు. భార్య డింపుల్ యాదవ్ కూడా ఉన్నారు. ఓటు వేసిన అనంత‌రం అఖిలేష్ యాద‌వ్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలంతా అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ఈ పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి మంచి పని చేయలేద‌ని విమ‌ర్శించారు. ఈసారి బీజేపీ రాష్ట్రం మొత్తం నుంచి తుడిచిపెట్టుకుపోతుంద‌ని వ్యాఖ్య‌నించారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో అభివృద్ధి జరగలేదని పేర్కొంటూ.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై మండిపడ్డారు. ఐదేళ్లు సీఎంగా ఉన్నా గోరఖ్‌పూర్‌లోని వైద్య కళాశాలలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించలేకపోయారనీ, గోరఖ్‌పూర్‌ను ఎక్స్‌ప్రెస్‌వేతో అనుసంధానం చేయలేకపోయారని విమ‌ర్శించారు. 

అలాగే, బీజేపీని రైతులు క్షమించరని అఖిలేష్ యాదవ్ అన్నారు. గోరఖ్‌పూర్‌లోని మెడికల్ కాలేజీకి పీజీఐకి వచ్చిన సౌకర్యాలు ఎందుకు ఇవ్వలేద‌ని ప్ర‌శ్నించారు. "బాబా ముఖ్యమంత్రి ఏ మంచి పని చేయలేదు. బాబా ముఖ్యమంత్రి తప్పుడు ప్ర‌చారం కొన‌సాగించారు. ఎక్క‌డో చైనాలో ఉన్న విమానాశ్రయం ఇక్క‌డిది అంటూ త‌ప్పుడు చిత్రాల‌తో ప్ర‌చారం చేశారు. ఈ పార్టీ అతి పెద్ద అబద్ధాలకోరు. వాళ్ల నాయకులంతా అబద్ధాలు చెబుతున్నారు" అని అఖిలేష్ యాద‌వ్ విమ‌ర్శించారు. రెండంకెల సీట్లు కూడా బీజేపీ రావ‌ని అన్నారు. ఈసారి సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని తెలిపారు. 

కాగా, ఉత్తరప్రదేశ్‌లోని 16 జిల్లాల్లోని 59 అసెంబ్లీ స్థానాలకు మూడో విడత పోలింగ్ ఆదివారం జరగనుంది. 627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడో దశ అసెంబ్లీ ఎన్నికల్లో 25,794 పోలింగ్‌ కేంద్రాలు, 15,557 పోలింగ్‌ కేంద్రాల్లో 2.16 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఏడు ద‌శ‌ల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. తదుపరి దశలు ఫిబ్రవరి 23, 27, మార్చి 3, 7 తేదీల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జ‌రగనుంది. మూడో ద‌శ‌లో ఎన్నికల జరిగే జిల్లాలు జాబితాలో.. హత్రాస్, ఫిరోజాబాద్, ఎటా, కస్గంజ్, మైన్‌పురి, ఫరూఖాబాద్, కన్నౌజ్, ఇటావా, ఔరయ్యా, కాన్పూర్ దేహత్, కాన్పూర్ నగర్, జలౌన్, ఝాన్సీ, లలిత్‌పూర్, హమీర్‌పూర్, మహోబా ఉన్నాయి. ఇక, నేడు మూడోదశ పోలింగ్ పూర్తయితే యూపీ అసెంబ్లీ‌లో మొత్తం 403 స్థానాల్లో దాదాపు సగం స్థానాలకు పోలింగ్ పూర్తయినట్టే. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న మెయిన్‌పురిలోని కర్హాల్ అసెంబ్లీ స్థానానికి ఈ దశలోనే పోలింగ్ జరగుతుంది. ఇక, అఖిలేష్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆయ‌నకు పోటీగా బీజేపీ నుంచి కేంద్రమంత్రి ఎస్పీ సింగ్‌ బఘేల్‌ బరి‌లోకి దిగారు.