ప్రయాగరాజ్ కుంభమేళాలో పోలీసుల తీరు ఎలా వుండనుందో తెలుసా?
ప్రయాగరాజ్ మహా కుంభమేళా కోసం యూపీ పోలీసులు ప్రత్యేక శిక్షణను ప్రారంభించారు. భక్తుల భద్రతతో పాటు, మర్యాదపూర్వక ప్రవర్తనపై దృష్టి సారించారు.
ప్రయాగరాజ్ : భారతీయ వారసత్వ సంపదలో భాగమే సాంప్రదాయ ఉత్సవాలు... ఇలాంటి వాటిలో అత్యంత కీలకమైనది ప్రయాగరాజ్ మహా కుంభమేళా. 12 ఏళ్లకోసారి యావత్ దేశం ఒక్కచోటికి చేరిందా అనేలా ఈ మేళా జరుగుతుంది. వచ్చే ఏడాది అంటే 2025 జనవరిిలో ఈ మహా కుంభమేళా ప్రారంభంకానుంది. యోగి సర్కార్ హయాంలో మొదటిసాారి జరుగుతున్న కుంభమేళా ఇది... కాబట్టి అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
కుంభమేళా 2025 నిర్వహణకు యోగి ప్రభుత్వం, యూపీ పోలీసులు పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. సీఎం యోగి ఆదేశాల మేరకు ఈ మహా కుంభమేళాలో యూపీ పోలీసులు మానవతా దృక్పథాన్ని ప్రదర్శించనున్నారు. ఇందుకోసం కుంభమేళాలో విధులు నిర్వహించే పోలీసులకు ప్రయాగరాజ్ పరేడ్ గ్రౌండ్‌లోని ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సంకల్ప్ శిక్షణ మండపంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
"మీ భద్రత-మా సంకల్పం" అనే నినాదంతో కుంభమేళాలో పోలీసులు విధులు నిర్వర్తించనున్నారు. మహా కుంభమేళా సమయంలో భక్తులకు అన్ని విధాలుగా సహాయం చేయడం, వారితో మర్యాదగా వ్యవహరించడంపై యూపీ పోలీసులు దృష్టి సారించారు. తద్వారా భక్తులు కుంభమేళా నుండి పుణ్యం, ఆహ్లాదకరమైన అనుభవాలతో తిరిగి వెళ్తారు. డిసెంబర్ వరకు కొనసాగే ఈ పోలీస్ శిక్షణ కార్యక్రమంలో మొదటి దశ 21 రోజుల పాటు సాగుతుంది. ఇందులో రెండు బ్యాచ్‌లలో శిక్షణ ఇవ్వబడుతోంది.
సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుంటున్న జవాన్లు
ప్రయాగరాజ్ మహా కుంభమేళా 2025 లో దాదాపు 40-50 కోట్ల మంది పాల్గొంటారని అంచనా. కేవలం ఒక్క మౌని అమావాస్య రోజునే దాదాపు 10 కోట్ల మంది భక్తులు సంగమంలో పవిత్ర స్నానం చేస్తారని అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు, సాధువులు, సన్యాసులు, పర్యాటకుల భద్రత యూపీ పోలీసుల చేతిలో ఉంది. అందుకు తగినట్లుగా యూపీ పోలీసులు సన్నద్దం అవుతున్నారు.
మహా కుంభమేళాలో భక్తుల భద్రతతో పాటు వారితో మర్యాదగా వ్యవహరించడంపై యూపీ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారని ఎస్ఎస్పీ రాజేష్ ద్వివేది తెలిపాారు. అందువల్లే ప్రయాగరాజ్‌లో అక్టోబర్ 16 నుండి జరుగుతున్న పోలీసు శిక్షణ కార్యక్రమంలో భద్రతా చర్యలతో పాటు, సాఫ్ట్ స్కిల్స్, లింగ సున్నితత్వంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతోందన్నారు. సాఫ్ట్ స్కిల్స్ కింద పోలీసు సిబ్బంది భక్తులతో మాట్లాడటం, వారికి సహాయం చేయడం, పార్కింగ్, రవాణా సౌకర్యాలు, మేళా యొక్క సరైన మార్గం, వసతి గురించి సమాచారం అందించడం వంటివి నేర్పిస్తున్నారు. అంతేకాకుండా మేళాకు వచ్చే సాధువులు, సన్యాసులతో ఎలా వ్యవహరించాలో కూడా నేర్పిస్తున్నారు.
భాషా అనువాదానికి యాప్ ఉపయోగం
విదేశీ పర్యాటకులకు, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే వారికి వారి భాషలో మాట్లాడి సహాయం చేయడానికి AI సాంకేతికతను ఉపయోగించడంపై కూడా శిక్షణ ఇస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. దీని కోసం అనేక భాషలను అనువదించగల ఓ యాప్‌ను కూడా అభివృద్ధి చేశామన్నారు. అంతేకాకుండా పోలీసు సిబ్బందికి చాట్‌బాట్ గురించి కూడా సమాచారం అందిస్తున్నారు. తద్వారా మేళాలో భక్తులకు అన్ని విధాలుగా సహాయం అందించవచ్చు.
లింగ సున్నితత్వంపై దృష్టి
ఈ శిక్షణ కార్యక్రమంలో లింగ సున్నితత్వంపై ప్రత్యేక దృష్టి సారించారు. మహా కుంభమేళాకు వచ్చే కోట్లాదిమంది మహిళా భక్తులకు సహాయం చేయడానికి ప్రతిచోటా మహిళా పోలీసులను నియమించడం సాధ్యం కాదని ఎస్ఎస్పీ రాజేష్ ద్వివేది తెలిపారు. అందువల్ల పురుష పోలీసు సిబ్బంది కూడా మహిళలతో సున్నితంగా వ్యవహరించడం, వారికి సహాయం చేయడం నేర్చుకుంటున్నారని తెలిపారు.
జల పోలీసులు, ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందికి ముఖ్యంగా కల్పవాసులు, స్నానం చేసేవారి భద్రత, మునిగిపోకుండా కాపాడటంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. జల పోలీసులు మేళాలో పడవల నిర్వహణ, భద్రతా ప్రమాణాలను పర్యవేక్షిస్తారని తెలిపారు. ట్రాఫిక్, సివిల్ పోలీసులు భక్తులు స్నాన ఘాట్‌లకు చేరుకోవడం, సురక్షితంగా తిరిగి వెళ్లడంపై దృష్టి సారిస్తారన్నారు. మహా కుంభమేళా 2025లో యూపీ పోలీసుల లక్ష్యం సీఎం యోగి దివ్య, భవ్య సురక్షిత మహాకుంభ్ సంకల్పాన్ని నెరవేర్చడమేనని ఎస్ఎస్పీ రాజేష్ ద్వివేది పేర్కొన్నారు.