రాజ్యసభలో త్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోద ముద్ర లభించిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం.. ముస్లిం మహిళలకు భర్తలు త్రిపుల్ తలాక్ చెప్పడం నేరంగా పరిగణిస్తారు. ఈ చట్టం తీసుకువచ్చినందుకు ఓ మహిళ ఆనందంతో ఎగిరి గంతులు వేసింది. ఆమె ఆనందంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేని ఆమె భర్త త్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ లోని బందా ప్రాంతానికి చెందిన ముఫీదా ఖాటూన్ అనే మహిళకు కొన్ని సంవత్సరాల క్రితం షంషుద్దీన్ అనే వ్యక్తితో వివాహమైంది. ఎప్పుడు భర్త త్రిపుల్ తలాక్ చెబుతాడో అనే భయంతో ఆమెలో ఎప్పుడూ ఉండేది. కాగా.. దానిని నేరంగా పరిగణిస్తూ... తాజాగా ప్రభుత్వం దానికి చట్ట రూపం కల్పించింది.

ఈ క్రమంలో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. రాజ్యసభలో ముమ్మారు తలాక్‌ బిల్లుకు ఆమోదముద్ర పడిందన్న సంతోషంతో ఎగిరి గంతేస్తున్న భార్యను చూసిన షంషుద్దీన్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.  భార్య ముఫీదా ఖాటూన్‌ దగ్గరకెళ్లి ‘తలాక్‌...తలాక్‌...తలాక్‌’ అంటూ మూడుసార్లు చెప్పి ఆమెను పంపేశాడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు షంషుద్దీన్‌పై కేసు నమోదుచేశారు.