కరోనా వైరస్ పేరు వింటే చాలు యావత్ ప్రపంచం వణికిపోతోంది. కరోనా పుణ్యమా అని సామాన్య ప్రజలకు పెద్దగా తెలియని లాక్ డౌన్, క్వారంటైన్, ఐసోలేషన్, శానిటైజర్ వంటి పదాలు ఇప్పుడు విరివిగా వినిపిస్తున్నాయి. దీంతో కరోనా సమయంలో జన్మిస్తున్న పిల్లలకు వీటిని పేర్లుగా పెడుతున్నారు. 

ఇటీవల ఇద్దరు కవల పిల్లలకు కరోనా, కోవిడ్ అని నామకరణం చేసుకున్నారు వారి తల్లిదండ్రులు. ఛత్తీస్‌ఘడ్‌, రాయ్‌పూర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఆసుపత్రిలో మార్చి 27 తెల్లవారుజామున ప్రీతివర్మ (27) అనే మహిళకు కవల పిల్లలు జన్మించారు. 

దీంతో వారు తమ పిల్లలకు కరోనా, కోవిడ్ అని పేర్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ సీజన్ నడుస్తున్న నేపథ్యంలో ప్రీతీ, ఆమె భర్త ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. వారిలో ఆడ శిశువుకు కరోనా అని, మగ శిశువుకు కోవిడ్ అని పేరు పెట్టారు.ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లోనూ ఇదే ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తనకు పుట్టిన కొడుకుని కోవిడ్ అని నామకరణం చేసింది.  వారి స్వస్థలం నేపాల్ కాగా.. లాక్ డౌన్ ప్రకటన తర్వాత తమ స్వస్థలానికి వెళ్లాలని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ అమలులో ఉండటంతో... వారు వెళ్లడానికి యూపీ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో... యూపీలోని రామ్ పూర్ లో ఉండిపోయారు. వారికి కొద్ది రోజుల క్రితం మగపిల్లాడు జన్మించగా.. తొలుత వేరే పేరు పెట్టారు. లాక్ డౌన్ లో ఇరుక్కున్న తర్వాత కోవిడ్ గా పేరు మార్చారు.

తాజాగా.. యూపీలో ఇలాంటి సంఘటనే మరోటి చోటుచేసుకుంది. ఇప్పటి వరకు కరోనా, కోవిడ్ లాంటి పేర్లు పెట్టగా.. వీళ్లు ఇంకాస్త వెరైటీగా శానిటైజర్ అని పేరు పెట్టారు.సహారన్‌పూర్ జిల్లాకు చెందిన ఓంవీర్ దంపతులకు ఆదివారం నాడు మగ పిల్లాడు జన్మించాడు. అయితే ఇది కరోనా లాక్ డౌన్ల కాలం కావడంతో వారు తమ కుమారుడికి శానిటైజర్ పేరు పెట్టుకున్నారు. 

ఇదేం పేరండి బాబు అంటూ  మీడియా వారిని సంప్రదించగా వారు ఈ సమాధానం చెప్పారు. ‘కరోనా కట్టడి కోసం ప్రధాని మోదీ, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్య నాథ చేపడుతున్న చర్యలను మమ్మల్ని ఎంతో ఆకట్టుకున్నాయి. శానిటైజర్లు అందరికీ అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరరూ తప్పనిసరిగా శానిటైజర్ వినియోగిస్తున్నారు. దీని వల్ల కరోనా వ్యాప్తికి బ్రేకులు పడుతున్నాయి అందుకే మా కుమారుడికి శానిటైజర్ అనే పేరు పెట్టాం’ అని గర్వంగా తమ నిర్ణయానికి గల కారణాలను వారు వివరించారు.