Asianet News TeluguAsianet News Telugu

ఉత్తరప్రదేశ్‌లో కొత్త జైలు మ్యానువల్.. వివాహిత మహిళలకు ఉపశమనాలు ఇవే..!

ఉత్తరప్రదేశ్‌లో కొత్త జైలు మ్యానువల్‌కు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వివాహిత మహిళలకు మంగళసూత్రం ధరించడానికి అనుమతించనుంది. భర్త లేదా బంధువులు అదే జైలులో ఉంటే వారానికి ఒక సారి కలుసుకోవడానికి అవకాశం ఇవ్వనుంది. ఖైదీల పిల్లలకూ పలు వసతులు కల్పించనుంది.

UP new jail manual facilitates married woman to wear mangalsutra
Author
First Published Aug 20, 2022, 5:08 PM IST

లక్నో: ఉత్తరప్రదేశ్ కొత్త జైలు మ్యానువల్‌ తెచ్చింది. ఈ మ్యానువల్‌లో వివాహిత మహిళలకు కొన్ని ఉపశమనాలు ఇచ్చింది. వీరితోపాటు జైలులోనే జన్మించిన పిల్లలకూ కొన్ని వెసులుబాట్లు తెచ్చింది. ఇక నుంచి వివాహిత మహిళలు మంగళసూత్రం ధరించవచ్చు. ఇంతకు ముందు కాళ్ల కడేలు, గాజులు, ముక్కు పుడకలకు మాత్రమే అనుమతి ఉండేది. అంతేకాదు, ఇక నుంచి కర్వా చౌతి, తీజ్ వంటి వాటిని కూడా వేడుక చేసుకోవచ్చు.

1941 రూల్ బుక్ నిబంధనలకు ఫుల్ స్టాప్ పెడుతూ కొత్త నిబంధనలకు రాష్ట్ర మంత్రివర్గం ఈ వారమే ఆమోదం తెలిపింది. ఈ కొత్త మ్యానువల్ మానవీయంగా ఉన్నదని, ముఖ్యంగా మహిళలకు అనుకూలంగా ఉన్నదని రాష్ట్ర మంత్రి ధరమ్ వీర్ ప్రజాపతి వెల్లడించారు.

మహిళలకు శానిటరీ నాప్కిన్స్, కోకోనట్ ఆయిల్, షాంపూలను వారికి అందజేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. జైలు శిక్ష అనుభవిస్తున్న మహిళకు జన్మించిన పిల్లలను రిజిస్టర్ చేసుకుని, వారికి తప్పక అందాల్సిన టీకాలను అందించనుంది. వారికి పురుడు కూడా చేయనున్నారు.

అంతేకాదు, తల్లితోపాటు జైలు బారాక్‌లో ఉంటున్న పిల్లల కోసం కేర్ తీసుకోనున్నారు. వారికి చదువు చెప్పించడానికి ప్రతి జైలులో ఒక టీచర్‌ను ఏర్పాటు చేయనున్నారు. స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కూడా ఏర్పాట్లు చేయనున్నారు. పేరెంట్స్ చేసిన నేరాలనే తరచూ వినకుండా వారి కోసం ప్రత్యేకంగా పార్కులు ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. పౌష్టికాహారం అందించనున్నట్టు తెలిపారు. 

ముస్లింలైనా.. హిందువులైనా ఉపవాసాలు ఉన్నప్పుడు డేట్స్ అందిస్తామని మంత్రి చెప్పారు. హోలీ, దీపావళిలకు ఖీర్ అందించనున్నారు. ఒకే జైలులో బంధువులు ఉంటే వారానికి ఒక సారి కలవడానికి అవకాశం ఇస్తారు. వేరే జైళ్లలో ఉంటే ఫోన్  చేసుకోవడానికి వీలు కల్పిస్తారు. అదే దోషులుగా ఇంకా నిర్ధారణ కాని వారికి హ్యాండ్ కఫ్స్ వేయరని, ఒంటరిగానూ నిర్బంధించబోరని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios