తనపై ఎమ్మెల్యే, అతని కుమారుడు అత్యాచారానికి పాల్పడ్డారంటూ.. ఓ సింగర్ సంచలన కామెంట్స్ చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. కాగా.. సదరు  ఎమ్మెల్యే, మరో ఇద్దరిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

 బీజేపీ మిత్రపక్షమైన నిషద్ పార్టీ ఎమ్మెల్యే విజయ్ మిశ్రా.. 2014లో ఓ కార్యక్రమం కోసం ఓ సింగర్ ని తన ఇంటికి పిలిచారు. ఈ కార్యక్రమంలో విజయ్ మిశ్రా, అతని కుమారుడు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ  సదరు సింగర్ ఇటీవల ఆరోపించారు.  ఈ విషయం ఎవరికైనా చెబితే.. తనను చంపేస్తామంటూ బెదిరించారని ఆమె వాపోయారు.

2015లో మరోసారి తనను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. అతని తర్వాత అతని కొడుకు, మేనల్లుడు కూడా ఆమె పై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఈ మేరకు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొందని ఎస్పీ రామ్ బదన్ సింగ్ చెప్పారు.

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మిశ్రా పై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. తాజాగా.. గతేడాది సెప్టెంబర్ లో  మధ్యప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి భూమిని ఆక్రమించుకున్నారనే కేసులో అరెస్టు అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఎమ్మెల్యే జైల్లో ఉన్నాడనే ధైర్యంతోనే తనకు జరిగిన అన్యాయాన్ని సదరు బాధితురాలు బయటపెట్టడం గమనార్హం.

తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని.. కానీ అతను ఎమ్మెల్యే అనే భయంతో తాను ఈ విషయం బయటపెట్టలేదని బాధితురాలు పేర్కొన్నారు. ఇప్పుడు అతను జైల్లో ఉన్నారనే ధైర్యంతో ఫిర్యాదు చేశానని ఆమె చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.