ఉత్తరప్రదేశ్‌లో ఓ చిరుత పులి కోసం ఏర్పాటు చేసిన బోనులో ఓ వ్యక్తి పడ్డాడు. ఆ బోనులో చిరుత పులికి ఎరగా ఓ కోడి పుంజును ఏర్పాటు చేశారు. కానీ, ఆ కోడి పుంజును చూసి చిరుతకు బదులు ఓ వ్యక్తి లోపటికి వెళ్లాడు. దాన్ని అందుకోగానే బోను మూసుకుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. 

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో‌ని బులంద్‌షహర్‌లో ఓ చిరుత పులి జనావాసాల్లో తిరుగుతూ కనిపిస్తున్నది. తరుచూ ఇది బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు ప్రమాదకర రీతిలో కనిపించడంతో దాన్ని పట్టుకోవడానికి అధికారులు చాలా సార్లు ప్రయత్నించారు. అదే విధంగా దాన్ని పట్టుకోవడానికి ఒక బోను కూడా ఏర్పాటు చేశారు. చిరుతను ఆకర్షించడానికి అందులో ఎరగా ఒక కోడి పుంజును కూడా కట్టి ఉంచారు. ఆ కోడి పుంజును పట్టి లాగగనే ఆ బోను మూసుకు పోతుంది. 

ఈ బోను వద్దకు వెళ్లిన ఓ వ్యక్తికి అందులోని కోడి పుంజుపై కన్ను పడింది. దాన్ని పట్టేసుకుంటే ఇంట్లో చికెన్ వండేసుకోవచ్చని అనుకున్నాడేమో. ఆ కక్కుర్తే అతడిని చిరుత కోసం ఏర్పాటు చేసిన బోనులో చిక్కుకునేలా చేసింది. ఆ వ్యక్తి బోనులోకి వెళ్లి కోడి పుంజును పట్టుకున్నాడు. ఇంకేం.. ఆ బోను మూసుకుపోయింది. దీంతో ఆ వ్యక్తి బోనులోనే చిక్కుకుపోయాడు. వెంటనే కేకలు వేశాడు. తనను బయటకు తీయాలని ప్రాధేయపడ్డాడు. అటవీ అధికారులకు విజ్ఞప్తులు చేశాడు.

Also Read: విపక్ష ఐక్యతపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి? తృణమూల్ పై రాహుల్ దాడి.. ‘కూటమి కావాలనుకుంటున్నాం’

ఆయన బోనులో చిక్కుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వీడియోను అటవీ అధికారులు ధ్రువీకరించారు కూడా. దీనిపై వారు ఇలా స్పందించారు.

Scroll to load tweet…

చిరుత పులి ఇక్కడ తరుచూ బయట కనిపిస్తున్నదని, ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగాడుతున్నదని కొందరు తమకు సమాచారం ఇచ్చారని, ఆ తర్వాత తాము అక్కడ ఒక ట్రాప్ ఏర్పాటు చేశామని వివరించారు. ఆ చిరుత పులి కోసం తాము గాలింపులు జరుపుతూనే అంతకు ముందే ఓ బోనును ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ బోనులో ఓ కోడి పుంజును ఎరగా పెట్టామని వివరించారు. అయితే, అందులోకి చిరుత వెళ్లడానికి బదులు.. ఓ వ్యక్తి కోడి పుంజు కోసం లోపటికి వెళ్లాడని తెలిపారు. కోడి పుంజును పట్టుకోగానే బోను మూసుకు పోయిందని అన్నారు. అతడిని ఆ వెంటనే బోను నుంచి బయటకు విడిచిపెట్టామని చెప్పారు.