పూర్వ కాలంలో... భర్త ఎంత చెడ్డవాడైనా, దంపతుల మధ్య ఎన్ని కలతలు ఉన్నా.. సమాజం కోసం, కుటుంబాల పరువు కోసం వాళ్లు జీవితాంతం కలిసి జీవించేవారు. కానీ ఇప్పుడు మాట్లాడితే విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. వరకట్నం కోసం వేధించారనో, వివాహేతర సంబంధం పెట్టుకున్నారనో... ఇలాంటి కారణాలతో విడాకులు కోరితే న్యాయంగానే ఉంటుంది. 

కానీ సిల్లీ కారణాల కోసం కూడా విడాకులు కోరుకుంటున్నారు. అలాంటి సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆహారంలో భాగంగా నా భార్య ప్రతిరోజు కేవలం లడ్డూలు మాత్రమే పెడుతుంది. విడాకులు ఇప్పించండి అంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లో చోటు చేసుకుంది.

ఆ వివరాలు.. బాధితుడికి పదేళ్ల క్రితం వివాహమయ్యింది. ఓ బాబు కూడా ఉన్నాడు. ఇన్నాళ్లు బాగానే సాగిన వీరి దాంపత్యంలో ఓ తాంత్రికుడి వల్ల కలతలు రేగాయి. గత కొద్ది కాలంగా బాధితుడు తరచుగా అనారోగ్యం పాలవుతున్నాడు. దాంతో అతడి భార్య ఓ తాంత్రికుడిని ఆశ్రయించింది. అతని సూచన మేరకు బాధితుడికి ప్రతి రోజు ఉదయం 4, సాయంత్ర నాలుగు చొప్పున లడ్డూలు భోజనంగా పెడుతుంది.

ఇక ఇతర ఏ పదర్థాలు ముట్టుకోనివ్వడం లేదు. దాంతో విసిగిపోయిన బాధితుడు, భార్య నుంచి తనకు విడాకులు ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం అధికారులు వీరిద్దరికి కౌన్సెలింగ్‌ ఇచ్చే పనిలో పడ్డారు. అప్పటికి మనసు మార్చుకోకపోతే.. విడాకులు ఇప్పిస్తామని తెలిపారు.