లక్నో: ఉత్తరప్రదేశ్ రా,్ట్రంలోని హర్దోయి జిల్లాలో దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. తన కూతురి తలను నరికిన వ్యక్తి, ఆ తలను పట్టుకుని రోడ్డు మీద నడుస్తూ వెళ్తుండడంతో గ్రామంలోని ప్రజలు తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యారు. 

సర్వేష్ కుమార్ అనే వ్యక్తి తన 17 ఏళ్ల కూతురు తల నరికాడు. ఆ తలను పట్టుకుని పోలీసు స్టేషన్ కు బయలుదేరాడు. దాన్ని గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ సంఘటన రాష్ట్ర రాజధాని లక్నోకు 200 కిలోమీటర్ల దూరంలో గల పండేతార గ్రామంలో చోటు చేసుకుంది. 

దాంతో ఇద్దరు పోలీసు అధికారులు వచ్చి అతన్ని నిలువరించడానికి ప్రయత్నించారు. సంఘటనను మొబైల్ ద్వారా చిత్రీకరించారు. నీ పేరేమిటి, ఎక్కడి నుంచి వస్తున్నావు, అది ఎవరి తల అంటూ పోలీసులు ప్రశ్నించారు సర్వేష్ తొణకకుండా బెణకకుండా ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. 

తన కూతురు ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుందని, అది ఇష్టం లేక ఆమెను తాను పదునైన ఆయుధంతో చంపేశానని సర్వేష్ చెప్పాడు. అ పని తానే చేశానని, మరెవరూ ఇందులో పాలు పంచుకోలేదని, మృతదేహం గదిలో ఉందని చెప్పాడు. 

తలను కింద పెట్టి , కూర్చోవాలని పోలీసులు అతనికి చెప్పారు. వారు చెప్పినట్లే అతను చేశాడు. సర్వేష్ ను స్టేషన్ కు తీసుకుని వచ్చి అరెస్టు చేశారు అతనిపై త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసులు చెప్పారు.