ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతను చెప్పిన మాయ మాటలను సదరు యువతి నిజమని నమ్మింది. పెళ్లి చేసుకుంటాడనే ధైర్యంతో శారీరకంగా దగ్గరైంది. ప్రతిఫలంగా ఆమె గర్భం దాల్చింది. దీంతో.. ఆమెకు ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడితే.. అబార్షన్ చేసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చాడు.  చివరకు గర్భస్రావమై ప్రియురాలు ప్రాణాలు కోల్పోతే.. అతను మరో వైపు వేరే యువతి మెడలో తాళి కట్టేందుకు రెడీ అయ్యాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మీరట్‌కు చెందిన రాహుల్‌ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన యువతిని పెళ్లి పేరు చెప్పి లొంగదీసుకున్నాడు. ఆమె గర్భవతి అయిందని తెలిసి బలవంతంగా గర్భస్రావం అయ్యే మాత్రలు మింగించాడు. దీంతో ఐదు నెలల గర్భవతిగా ఉన్న ఆమె మీరట్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించింది. బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడు ఉన్న చోటుకు వెళ్లారు. అక్కడ అతడి పెళ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెళ్లికి మరి కొన్ని నిమిషాలు మాత్రమే ఉండగా పోలీసులు రాహుల్‌ను అరెస్ట్‌ చేశారు. పలు సెక్షన్ల క్రింద అతడిపై కేసులు నమోదు చేశారు