విద్యుత్ శాఖలో లైన్‌మెన్‌గా పని చేస్తున్న ఓ ఉద్యోగి తన ఇంటికి దగ్గరగా ట్రాన్స్‌ఫర్ చేయాలని జూనియర్ ఇంజినీర్‌కు విజ్ఞప్తి చేయగా.. డబ్బు డిమాండ్ చేశారు, అసభ్యకరంగా మాట్లాడారు. ఒక రోజు రాత్రి తన భార్యను పంపిస్తే ట్రాన్స్‌ఫర్ చేయిస్తానని అన్నారు. దీంతో ఆ ఉద్యోగి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. యూపీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటుచేసుకుంది. యూపీ విద్యుత్ శాఖలో ఓ సీనియర్ అధికారి హరాస్‌మెంట్ పరాకాష్టకు చేరింది. తనను దయచేసి ట్రాన్స్‌ఫర్ చేయండి సార్ అని అడిగిన ఉద్యోగిపై ఆ సీనియర్ అధికారి ఫైర్ అయ్యారు. ఇలా అడిగిన ప్రతిసారీ నోటికొచ్చినట్టు దూషించేవారు. ఏకంగా తన భార్యను ఒక రాత్రికి తమ దగ్గరకు పంపిస్తే ట్రాన్స్‌ఫర్ చేయిస్తా అని అనడంతో ఆ ఉద్యోగి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఉద్యోగి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పింటించుకున్నాడు. ఆఫీసు ముందే ఆత్మహత్య చేసుకున్నాడు.
యూపీ పవర్ డిపార్ట్‌మెంట్‌లో 45 ఏళ్ల గోకుల్ ప్రసాద్ పని చేస్తున్నాడు. ట్రాన్స్‌ఫర్ కోసం తన బాస్‌కు విజ్ఞప్తి చేయగా.. తన భార్యను ఒక రాత్రికి పంపిస్తావా? అని అడిగాడు. ఈ వ్యాఖ్యతో గోకుల్ తీవ్ర వేదనకు గురయ్యాడు. లఖింపూర్‌లోని జూనియర్ ఇంజినీర్ కార్యాలయం ముందే డీజిల్ ఒంటి పై పోసుకున్నాడు. నిప్పు అంటించుకున్నాడు. ఆయనను సమీపంలోని హాస్పిటల్ తరలించారు. కానీ, ట్రీట్‌మెంట్ పొందుతూ ఆయన ఆదివారం ప్రాణాలు వదిలాడు.
జూనియర్ ఇంజినీర్ నాగేంద్ర కుమార్, ఓ క్లర్క్‌లను సస్పెండ్ చేశారు. వారిద్దరి పై పోలీసు కేసు నమోదైంది.
గోకుల్ ప్రసాద్ ఆత్మహత్య చేసుకుంటూ ఓ వీడియో తీశాడు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆయనను పురికొల్పిన అంశాలను ఏకరువు పెట్టాడు. తీవ్రమైన వేదనతో అన్ని విషయాలు మాట్లాడాడు. జూనియర్ ఇంజినీర్, ఆయన సహాయకుడు తనను చాలా కాలం నుంచి వేధిస్తున్నారని చెప్పాడు. ఆ వేధింపులకు తాళలేక తాను పోలీసు స్టేషన్‌కు కూడా వెళ్లినట్టు వివరించాడు. కానీ, అక్కడి నుంచి తనకు సహాయం లభించలేదని పేర్కొన్నాడు.
కాగా, మరో వీడియోలో గోకుల్ ప్రసాద్ భార్య మాట్లాడారు. గోకుల్‌ను గత మూడేళ్లుగా వేధిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ వేధింపుల కారణంగా ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లారని వివరించారు. దాని నుంచి బయటపడటానికి ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటున్నాడని చెప్పారు. అయినా.. గోకుల్‌ను వారు విడిచిపెట్టలేదని పేర్కొన్నారు. ఆయనను అలీగంజ్‌కు బదిలీ చేశారని, అక్కడికి ప్రయాణించడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాడని వివరించారు. తన ఇంటికి దగ్గరగా ట్రాన్స్‌ఫర్ చేయాలని పై వారిని తన భర్త అడిగారని చెప్పారు. ఇలా అడిగితే.. ఆయన భార్యను వారితో పడుకోబెడితే.. ట్రాన్స్‌ఫర్ చేస్తాం అని గోకుల్‌ను వేధించారని పేర్కొన్నారు.
ఆయన డీజిల్ పోసుకుని నిప్పు అంటించుకుంటూ ఉంటే కూడా వారు అక్కడే ఉండి చూస్తూ నిలబడి ఉన్నారని ఆమె తెలిపారు. ఒక్కరు కూడా ఆయనను రక్షించడానికి ముందుకు రాలేదని వివరించారు.
బదిలీ గురించి విజ్ఞప్తి చేస్తే ఆ జూనియర్ ఇంజినీర్ తరుచూ డబ్బు డిమాండ్ చేసేవాడని, అసభ్యకరంగా మాట్లాడేవాడని లైన్‌మెన్ ఆరోపించాడని సీనియర్ పోలీసు అధికారి సంజీవ్ సుమాన్ చెప్పారు. తాము కేసు నమోదు చేశామని వివరించారు. డిపార్ట్‌మెంట్ లెవెల్‌లో జూనియర్ ఇంజినీర్‌ను సస్పెండ్ చేశారని, దర్యాప్తు మొదలైందని తెలిపారు.
