మీరట్:  ఓ మహిళను చంపి డ్రామాలు ఆడిన ప్రేయసీప్రియులను పోలీసులు అరెస్టు చేశారు. బులంద్ షహర్ లో జరిగిన మహిళ హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. సికింద్రాబాదులో జనవరి 26వ తేదీన ఓ మహిళ శవాన్ని పోలీసులు కనిపెట్టారు. ఆ మహిళను 20 ఏళ్ల పూనమ్ గా గుర్తించారు. నోయిడాకు చెందిన పూనమ్ ఓ మొబైల్ కంపెనీలో పనిచేస్తోంది. 

ఈ హత్య ఘటనలో పోలీసులు 20 ఏళ్ల వయస్సులో ఉన్న బులంద్ షహర్ కు చెందిన ప్రేయసీప్రియులను అరెస్టుచేశారు. అరెస్టయిన కపిల్, రూబీ శర్మ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారు. అయితే, రూబీ కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదు.

క్రైమ్ షోలు చూసిన ఆ ప్రేమజంట రూబీ చనిపోయినట్లుగా చూపించడానికి పూనమ్ ను హత్య చేశారని పోలీసులు గుర్తించారు. పూనమ్ ను హత్య చేసి, ఆనవాళ్లు కనిపించకుండా ముఖాన్ని ధ్వంసం చేసి, రూబీ దుస్తులను, ఆభరణాలను ఆమె శవంపై ఉంచారు. మరణించిన యువతిని రూబీగా నమ్మించడానికి ఆ పనిచేశారు. 

రూబీతో కపిల్ ప్రేమలో ఉన్నాడని, పూనమ్ ను చంపి పశువుల కొట్టులో శవాన్ని పారేసి, దాన్ని నిప్పు పెట్టి రూబీ చనిపోయినట్లుగా నమ్మించాలని చూశారని, పథకం ప్రకారం ఆ జంట పూనమ్ ను హత్య చేసిందని పోలీసులు చెప్పారు. 

ముందుగా వేసుకున్న పథకం ప్రకారం... కపిల్ పూనమ్ తో పరిచయం చేసుకుని స్నేహం చేశాడు. జనవరి 25వ తేదీన షాపింగ్ కని చెప్పి ఆమెను తీసుకుని వెళ్లాడు. నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి కారు సీటు బెల్టుతో గొంతు బిగించి చంపాడు. ఆ తర్వాత ఆమె శవాన్ని రూబీ ఇంటి పక్కన ఉన్న పశువుల కొట్టంలో పడేశాడు. 

ఈలోగా, తమ కూతురు కనిపించడం లేదని రూబీ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కపిల్ పై వారు అనుమానం వ్యక్తం చేశారు. ఈలోగా నోయిడా పోలీసులు బులంద్ షహర్ పోలీసులను అప్రమత్తం చేశారు. పూనమ్ ముఖాన్ని పూర్తిగా ధ్వంసం చేసేలోగా పోలీసులు అక్కడికి చేరుకుని కపిల్ ను అరెస్టు చేశారు. ఆ తర్వాత రూబీని కూడా అరెస్టు చేశారు.