పెళ్లికి ముందు కొత్త పెళ్లికొడుకు స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ ఇవ్వడం ఈ మధ్య చాలా కామన్ గా మారింది. పాపం ఆ పెళ్లి కొడుకు కూడా అలానే పెళ్లికి ముందు పార్టీ ఇచ్చాడు. అయితే.. అనూహ్యంగా.. అలా పెళ్లి కాగానే.. వరుడు దారుణ హత్యకు గురయ్యాడు. బ్యాచిలర్ పార్టీ లో అడిగినంత మద్యం పోయలేదని చెప్పి.. స్నేహితులే వరుడిని హత్య చేయడం గమనార్హం. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగడ్ లో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే..

అలీగఢ్ లోని పాలీముకీంపూర్ గ్రామానికి చెందిన 28ఏళ్ల బబ్లూకు గత సోమవారం అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహమైంది. పెళ్లికి వచ్చిన తన స్నేహితులకు ఆ వరుడు స్పెషల్ మందు, విందు ఉండేలా ఏర్పాట్లు చేశాడు. కాగా.. పెళ్లి తర్వాత బబ్లూ.. తన స్నేహితుల వద్దకు వెళ్లాడు. అప్పటికే పీకలదాకా మద్యం తాగి ఉన్న అతని స్నేహితులు  మరింత మద్యం కావాలంటూ డిమాండ్ చేశారు.

అయితే.. బబ్లూ వారిని వారించాడు. అప్పటికే ఎక్కువ మద్యం తాగేశారని.. అంతకన్నా ఎక్కువ తాను తీసుకురాలేనని చెప్పాడు. దీంతో.. బబ్లూతో అతని స్నేహితులకు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో స్నేహితుల్లో ఒకరు బబ్లూని కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.