Asianet News TeluguAsianet News Telugu

వికాస్ దూబే తలపై రివార్డు పెంచిన యోగి సర్కార్

అతడిని పట్టించిన వారికి ప్రకటించిన రూ. 2.5 లక్షల రివార్డును రూ. 5 లక్షలకు పెంచినట్టు అధికారులు వెల్లడించారు.
 

UP govt increases reward on providing information about Vikas Dubey to Rs 5 lakh
Author
Hyderabad, First Published Jul 8, 2020, 2:41 PM IST

ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న ఉత్తర ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేపై రివార్డును భారీగా పెంచుతూ యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అతడిని పట్టించిన వారికి ప్రకటించిన రూ. 2.5 లక్షల రివార్డును రూ. 5 లక్షలకు పెంచినట్టు అధికారులు వెల్లడించారు.

 ‘‘వికాస్ దూబే అరెస్టుపై ఉన్న నగదు రివార్డును రూ.5 లక్షలకు పెంచడం జరిగింది. అతడి ఆచూకీ చెప్పిన వారికి ఈ మొత్తాన్ని బహుమతిగా ఇస్తాం..’’ అని అదనపు చీఫ్ సెక్రటరీ అవనీశ్ కుమార్ అవస్తి వెల్లడించారు.  ఈ నెల 3న కాన్పూర్‌లోని బిక్రులో 8 మంది పోలీసులను కాల్చిచంపిన కేసులో దూబే ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 

ఇదిలా ఉండగా.. గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే చేస్తున్న అక్రమాలు ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో తనను అరెస్ట్ చేయడానికి వస్తున్నారని 8మంది పోలీసులను అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా... విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

పోలీసులు.. ఆ గ్రామంలో ఎంటర్ అయ్యారన్న సమాచారాన్ని.. పోలీసులే అందించినట్లు బయటపడింది. ఎనిమిది మంది సహచరుల మృతికి కారణం డిపార్ట్ మెంట్ వారే అని తేలడం గమనార్హం. వికాస్ దూబేకి ఎంతమంది పోలీసులతో సంబంధాలు ఉన్నాయో తెలుసుకుని.. పోలీసు ఉన్నతాధికారులే ఆశ్చర్యపోతున్నారు. కాన్పూర్‌లోని చౌబేపూర్, బీహౌర్, కక్వాన్, శివరాజ్ పూర్ పోలీసు స్టేషన్లకు చెందిన సుమారు 200 మందికి పైగా పోలీసులపై దర్యాప్తు జరుపుతున్నారు. 

 చౌబేపూర్ పోలీసు స్టేషన్ లో ప్రస్తుతం పని చేస్తున్నవారితో పాటు గతంలో పని చేసిన వారు కూడా.. దూబే వల్ల ఏదో విధంగా ప్రయోజనం పొందినవారేనని తెలుస్తోందన్నారు. దూబే పారిపోవడానికి వీరిలో చాలామంది సహకరించినట్టు తెలుస్తోంది.

కాగా.. ఆ ఎనిమిది మంది పోలీసులను హత్య చేసిన అనంతరం.. వికాస్ దూబే.. దేశ రాజధాని ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వికాస్.. హర్యానాలో ని ఓ హోటల్ లో దాక్కున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలియగానే.. అతని కోసం సోదాలు చేపట్టారు. అయితే.. అప్పటికే వారు పరారు కావడం గమనార్హం.

కాగా.. వికాస్ కి సహకరించారనే ఆరోపణలతో చౌబేపూర్ పోలీసు స్టేషన్ కి చెందిన పది మంది కానిస్టేబుళ్లను ఇప్పటికే సస్పెండ్ చేశారు. మరోవైపు కొంతమంది రాజకీయ నేతలతో తనకు సంబంధాలు ఉన్నట్లు స్వయంగా వికాస్ దూబే చెప్పిన వీడియో..  ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios