ఆమె ఓ న్యాయ విద్యార్థిని... చదువు, ఇల్లు తప్ప మరో ప్రపంచం తేలీదు.  హాయిగా సాగిపోతున్న జీవితంలోకి  ఒక్కసారిగా పెను తుఫాను వచ్చింది. ఇద్దరు వ్యక్తులు ఆమె జీవితాన్ని  నాశనం చేశారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తనపై అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె అనుకుంది. కానీ.. ఆమె సాధ్యం కాలేదు.. పోలీసులు, చట్టం ఎవరూ ఆమెకు సహకరించలేదు. దీంతో.. ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... యూపీలోని బారాబంకీ నగర సమీపంలోని సెంరవ గ్రామంలో వెలుగుచూసింది. సెంరవ గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువతి కళాశాలలో న్యాయవిద్య అభ్యసించేది. నాలుగు నెలల క్రితం యువతిపై సెంరవ గ్రామానికి చెంవదిన శివకుమార్, శివపల్టాన్ లనే ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. 

అత్యాచారంపై బాధిత యువతి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంతో బాధిత విద్యార్థిని కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తీసుకువచ్చారు. దీంతో పోలీసులు అత్యాచారంపై కేసు నమోదు చేసినా నిందితులను మాత్రం అరెస్టు చేయలేదు.
 
నిందితులు రాజకీయంగా పలుకుబడి ఉన్నవారు. తన కూతురిపై అత్యాచారం చేసిన వారే కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చారని, దీంతో కలత చెంది సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా తమ కుమార్తె ఆత్మహత్య ఘటనలో ఎవరిపై అనుమానం లేదని మృతురాలి తండ్రి రాతపూర్వకంగా తెలిపారని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఆకాష్ తోమర్ చెప్పారు.