అట్టహాసంగా ఉత్తర ప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు... యోగి సర్కాార్ ప్లాన్ ఇదే...
జనవరి 24-26 వరకు ఉత్తరప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి.

లక్నో : ఉత్తరప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఈ జనవరి 24 నుండి 26 వరకు అవధ్ శిల్ప్ గ్రామంలో జరుగుతాయి. మహా కుంభమేళా సెక్టార్-7, నోయిడా శిల్ప్ గ్రామంతో పాటు రాష్ట్రంలోని 75 జిల్లాల్లోనూ వేడుకలు నిర్వహిస్తారు. లక్నోలో జరిగే ప్రధాన వేడుకలకు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరవుతారు.
ఈ అవతరణ వేడులకపై రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జైవీర్ సింగ్ మాట్లాడుతూ... ఉత్తరప్రదేశ్ దినోత్సవం-2025 థీమ్ 'వికాస్ వారసత్వం ప్రగతి పథ్ పర్ ఉత్తర ప్రదేశ్' అని తెలిపారు. అన్ని శాఖలు ఈ థీమ్‌తో ప్రదర్శనలు, సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు, రోడ్ షోలు నిర్వహిస్తాయన్నారు. జనవరి 24న ఉత్తరప్రదేశ్ దినోత్సవం, 25న జాతీయ పర్యాటక దినోత్సవం-ఓటర్ల అవగాహన దినోత్సవం, 26న గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుగుతాయన్నారు.
వారసత్వం, అభివృద్ధిపై ప్రదర్శన
వారసత్వం, అభివృద్ధిపై ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయని మంత్రి తెలిపారు. వారసత్వ ప్రదర్శనలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ఆయన జీవితం గురించి ప్రదర్శిస్తారన్నారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్, మన రాజ్యాంగం, మన ఆత్మగౌరవం వంటి అంశాలపై ప్రదర్శనలు ఉంటాయి. వివిధ రంగాల్లో విజయం సాధించిన వారిని సత్కరిస్తారు. 75 జిల్లాల నుంచి ఒక్కో జిల్లాకు ఒక ఉత్పత్తి (ODOP), కళా శిల్పాల ప్రదర్శన, ఫుడ్ కోర్టుల్లో వివిధ ప్రాంతాల వంటకాలు లభిస్తాయి.
పర్యాటక దినోత్సవ వేడుకలు
జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా యువ పర్యాటక క్లబ్ సభ్యులు చిత్రలేఖనం, రీల్స్, పర్యాటక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకంపై షార్ట్ ఫిల్మ్, యువ పర్యాటక క్లబ్ సభ్యుల కార్యకలాపాలపై షార్ట్ ఫిల్మ్ ప్రదర్శన ఉంటుంది. జనవరి 26న సాంస్కృతిక, కళా రంగాల ప్రముఖులను రాజ్ భవన్ లో సత్కరిస్తారు. పర్యాటక రంగంలో విశేష కృషి చేసిన వ్యవస్థాపకులు, స్వయం సహాయక సంఘాల్లో విశేష కృషి చేసిన మహిళలను సత్కరిస్తారు.
ఆరుగురికి ఉత్తరప్రదేశ్ గౌరవ్ సమ్మాన్
వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ఆరుగురికి ఉత్తరప్రదేశ్ గౌరవ్ సమ్మాన్ అందజేస్తారు. వీరికి రూ.11 లక్షల నగదు, ప్రశంసాపత్రం, శాలువా అందజేస్తారు. ఈ సన్మానం వారణాసికి చెందిన కృష్ణకాంత్ శుక్లా (భౌతిక శాస్త్రవేత్త, సంగీతకారుడు, కవి), వృందావన్ మథురకు చెందిన హిమాంశు గుప్తా (వ్యవస్థాపకుడు-పర్యావరణవేత్త), కాన్పూర్ కు చెందిన మనీష్ వర్మ (వ్యవసాయ-దళిత వ్యవస్థాపకుడు), బులంద్‌షహర్ కు చెందిన కృష్ణ యాదవ్ (మహిళా వ్యవస్థాపకురాలు), బులంద్‌షహర్ కు చెందిన కల్నల్ సుభాష్ దేశ్‌వాల్ (వ్యవసాయ-వ్యవస్థాపకుడు), బహ్రాయిచ్ కు చెందిన డాక్టర్ జై సింగ్ (అరటి పండ్ల ఉత్పత్తి) లకు లభిస్తుంది.

