UP Elections 2022:ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో సమాజ్‌వాదీ పార్టీకి అనుకూలంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే.. ఆమెకు వారణాసిలో నిరసన సెగ తాకింది. పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు రైట్ వింగ్ కార్యకర్తల బృందం.
UP Elections 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో సమాజ్‌వాదీ పార్టీకి అనుకూలంగా ఉత్తరప్రదేశ్ వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొంటున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ. ఎన్నికలలో సమాజ్‌వాదీ పార్టీ తరపున ప్రచారం చేయడానికి రెండు రోజులు ప్రధానమంత్రి నియోజకవర్గం వారణాసి లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం వారణాసిలో ఆమెకు నిరసన సెగ తాకింది.
యూపీ పర్యటనకు ముందు మమతా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అఖిలేష్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించడానికి వారణాసికి వెళ్లబోతున్నాను. అలాగే వారణాసి గుడిని కూడా దర్శించుకుంటాను. బెంగాల్ ప్రజల ఆశీర్వాదం తీసుకున్నాకే యూపీకి వెళ్తున్నాను’’ అని మమతా బెనర్జీ అన్నారు. కానీ, బుధవారం సాయంత్రం వారణాసిలో ఆమెకు నిరసన సెగ తాకింది. ఆమెకు పలు చోట్ల నిరసన ప్రదర్శనలు ఎదురయ్యాయి. రైట్ వింగ్ కార్యకర్తల బృందం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి నల్ల జెండాలు చూపుతూ నిరసన వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి 'గంగా హారతి' చూసేందుకు దశాశ్వమేధ ఘాట్‌కు వెళుతుండగా నిరసనలు ఎదురయ్యాయి. గొదౌలియా కూడలికి సమీపంలో హిందూ యువ వాహిని (HYV) కార్యకర్తల బృందం ఆమెకు నల్ల జెండాలు చూపించి "గో బ్యాక్, గో బ్యాక్ష, "జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేశారు. నల్ల జెండాలు పట్టుకుని నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
దీంతో మమతా బెనర్జీ.. ఆగ్రహానికి గురై.. ఏకంగా కారు దిగి వారి ముందు నిలబడ్డారు. అప్రమత్తమైన పోలీసు సిబ్బంది కార్యకర్తలను అక్కడ నుంచి పంపించి.. తర్వాత ఆమె కారు ఎక్కారు. ఓటమి భయంతోనే ఇదంతా చేస్తున్నారని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు నిరసన కారులను అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ఈ ఘటనపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. “అక్క, తమ్ముడు కలిసి ప్రచారం నిర్వహించడంతో బీజేపీ భయపడుతోందనీ. పశ్చిమ బెంగాల్‌లో ఘోర పరాజయం ఎదుర్కొబోతున్నట్టు వారికి అర్థమయ్యిందని అఖిలేష్ యాదవ్ అన్నారు. అందుకే బనారస్‌లో మమతా బెనర్జీకి నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేసారని విమర్శించారు.
ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై బీజేపీ నేత సోమనాథ్ విశ్వకర్మ స్పందించారు. తమ పార్టీకి చెందిన కార్యకర్తల ఇలాంటి పనులు చేయారని, బీజేపీ కార్యకర్తపై వస్తున్న ఆరోపణలను విశ్వకర్మ తోసిపుచ్చారు. వారు బిజెపి కార్యకర్తలు కాదనీ, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. బీజేపీ కార్యకర్తలు నిశ్శబ్దంగా, క్రమశిక్షణతో ఉంటారనీ, వారు అలాంటి పనులు చేయరని ఆయన అన్నారు.
గురువారం నగరంలో జరిగే బహిరంగ ర్యాలీలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కలిసి మమత ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి SBSP చీఫ్ ఓంప్రకాష్ రాజ్‌భర్ కూడా హాజరుకానున్నారు. ఆయన కుమారుడు, SBSP ప్రధాన కార్యదర్శి అరవింద్ రాజ్‌భర్ ఇక్కడి శివపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి SP-SBSP కూటమి అభ్యర్థిగా ఎన్నికల పోటీలో ఉన్నారు. కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ జిల్లా విభాగం ఉపాధ్యక్షుడు సంజయ్ మిశ్రా తెలిపారు.
మార్చి 7న యూపీ ఎన్నికల్లో చివరిగా ఏడో దశ పోలింగ్ జరుగనున్నది. ఈ దశలో తొమ్మిది జిల్లాల్లోని 54 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలుబడనున్నాయి.
