ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. యూపీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ లభించిందని అన్నారు. మాఫియాను అరికట్టామని తెలిపారు.
UP Election News 2022 : ఉత్తరప్రదేశ్ (utharpradesh) అసెంబ్లీకి రెండు దశల ఎన్నికల ముగిశాయి. మూడో దశ ఎన్నికలకు అంతా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అధికారపక్షం, ప్రతిపక్షాలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తాము గెలిస్తే ఏం చేస్తామో చెబుతూ.. ఇతర పార్టీలపై విమర్శలు చేస్తున్నాయి. అధికార పక్షంపై ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలపై అధికార పక్షం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి.
ఉత్తరప్రదేశ్ మూడో దశ ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోడీ (prime minister narendra modi) బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూపీలో ఉన్న గత ప్రభుత్వాలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. గత ఐదేళ్లలో బీజేపీ (bharathiya janatha party-bjp) ప్రభుత్వం చేసిన ప్రగతిని గుర్తు చేశారు. యూపీలో బీజేపీ అంటే ‘దంగరాజ్, మాఫియారాజ్, గుండారాజ్’పై నియంత్రణ అన్నట్టే అని ప్రధాని చెప్పారు. అన్ని రకాల పండగలను స్వేచ్చగా జరుపుకోవడమే అని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ (seethapur)లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. బీజేపీకి ఓటు వేయడం అంటే కూతుళ్లకు, మహిళలకు పోకిరీల నుంచి రక్షణ కల్పించడమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రెట్టింపు వేగంతో అమలు చేయడమేనని చెప్పారు.
సీతాపూర్ (seethapur) లో ప్రజలు బీజేపీని కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ (samajwadi party), బహుజన్ సమాజ్ పార్టీ (bahujan samajwadi party)పై ప్రధాని తీవ్రంగా ఆరోపణలు గుప్పించారు. 2007 నుంచి 2017 వరకు గత ప్రభుత్వాలు 2 లక్షలకు మించి ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. గత 5 ఏళ్లలో యోగి ఆదిత్యనాథ్ (yogi adityanath)ప్రభుత్వం 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని అన్నారు. యూపీలో మిగిలిన ఐదు దశల పోలింగ్‌లో కూడా బీజేపీకి ఓటర్ల మద్దతు లభిస్తుందని ప్రజల ఉత్సాహం తెలియజేస్తోందని ప్రధాని అన్నారు.
బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేస్తూ.. కోవిడ్-19 (covid -19) మహమ్మారి సమయంలో ఎవరూ ఆహారం లేకుండా పడుకోకుండా చూసుకున్నారని తెలిపారు. పేదలకు అందాల్సిన ప్రతీ రేషన్ గింజను ఇంతకు ముందు మాఫియా దోచుకున్నదని అన్నారు. అయితే ఇప్పుడు అది వారి ఇంటికి చేరుతోందని ప్రధాని స్పష్టం చేశారు. “ మీలాగే నేను పేద కుటుంబం నుంచి వచ్చాను. నేను పేదరికం ప్రసంగాలు వినలేదు.. నేను పేదరికం అనుభవించి వచ్చాను. ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పేదలకు సాధికారత కల్పించేందుకు, యూపీని ఉత్తమ్‌ప్రదేశ్‌గా మార్చేందుకు కృషి చేస్తోంది.’’ అని అన్నారు. గత ప్రభుత్వాలపై దాడి చేసిన ప్రధాని, మాఫియా పాలనలో పేదల కష్టాలు వినిపించలేదని తెలిపారు.
ఈ ప్రచారం సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ఉత్తరప్రదేశ్‌ను గతంలో రాజవంశాలు పరిపాలించాయని అన్నారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను అల్లర్లు, నేరస్థుల నుంచి విముక్తి చేయడానికి కృషి చేసిందని ప్రధాని చెప్పారు. ఫిబ్రవరి 23న నాలుగో దశలో ఎన్నికలు జరగనున్న సీతాపూర్ జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రధాని మోడీ ర్యాలీ కవర్ చేసింది.
