సమాజ్ వాదీ పార్టీ వల్లే యూపీలో నేరాలు పెరిగాయని బీజేపీ చేస్తున్న వరుస దాడులపై అఖిలేష్ యాదవ్ స్పందించారు. బీజేపీ పాలనలోనే ఉత్తరప్రదేశ్ నేరాల్లో నెంబర్ వన్ గా నిలిచిందని ఆరోపించారు. రికార్డులు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందని తెలిపారు. 

UP Election News 2022 : గ‌త ప్ర‌భుత్వాల తీరు వ‌ల్ల ఉత్త‌రప్ర‌దేశ్ అన్యాయానికి గురైందంటూ బీజేపీ చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై స‌మ‌జ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ మండిప‌డ్డారు. బీజేపీ అబ‌ద్దాలు చెప్పి ఓట‌ర్ల‌ను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. “ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటాను ముందుకు తీసుకురావాలి. నేడు యూపీ మహిళలపై జ‌రిగే నేరాలలో నెంబ‌ర్ వ‌న్ గా, కస్టడీ మరణాలలో నెంబ‌ర్ వ‌న్ గా, జాతీయ మానవ హక్కుల కమిషన్ నుండి అందిన నోటీసుల సంఖ్య ప్రకారం బూటకపు ఎన్‌కౌంటర్లలో నెంబ‌ర్ వ‌న్ గా ఉంది ’’ అని అఖిలేష్ యాదవ్ అన్నారు. ఈ మేర‌కు శుక్ర‌వారం సువార్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఓ మీడియా సంస్జ ప్రత్యేకంగా మాట్లాడారు. 

‘‘ ఎక్క‌డైనా IPS ఆఫీస‌ర్ పరారీలో ఉన్నట్లు ఎవరైనా విన్నారా ? ఇలాంటి ప‌రిస్థితులు కల్పించిన వారు శాంతి భద్రతల గురించి మా వైపు వేళ్లు చూపిస్తున్నారా ?’’ అని అఖిలేష్ యాదవ్ అన్నారు. నేరస్తులను ప్రోత్సహిస్తున్నామని తమ పార్టీపై బీజేపీ చేస్తున్న ఆరోపణలను తగ్గించాలని ఆయ‌న తెలిపారు. ‘‘ హత్రాస్‌లో ఏం జరిగిందో మీరు ఎలా మరచిపోగలరు ? లఖింపూర్‌లో ఏం జరిగింది ? లక్నోలో ఆపిల్ ఉద్యోగి ఏమయ్యాడు ? అతను హత్యకు గుర‌య్యాడు. గోరఖ్‌పూర్‌లో ఒక వ్యాపారవేత్తను కొట్టి చంపారు. ప్రజలకు ఇవన్నీ గుర్తున్నాయి.’’ అని ఆయ‌న అన్నారు. ‘‘ మొదటి దశలో ప్రజలు ఓటు వేయడానికి వచ్చిన విధానం బట్టి వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని తెలుస్తోంది. రెండో, మూడో దశలో కూడా అలాగే ఉంటుంది. ’’ అని అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్త‌రప్ర‌దేశ్ లో స‌మాజ్ వాదీ పార్టీ వ‌ల్లే నేరాలు జ‌రిగాయ‌ని బీజేపీ త‌ర‌చూ విమ‌ర్శిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

ఇదిలా ఉండ‌గా.. మొదటి రౌండ్ పోలింగ్ తర్వాత అఖిలేష్ యాదవ్ నిద్ర పోయాడని, ఉత్తరప్రదేశ్‌లోని 403 సీట్లలో 300 సీట్లకు పైగా సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మార్చి 7వ తేదీన ఏడుద‌శ‌ల్లో ఎన్నిక‌లు పూర్త‌వుతాయ‌ని, మార్చి 10వ తేదీన వెలువడుతాయని ఆయ‌న చెప్పారు. ‘‘ ఉత్తరప్రదేశ్‌లో ఏం చేశారని అఖిలేష్ యాదవ్ అడుగుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ శాంతిభద్రతలను పునరుద్ధరించిందని, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడిందని నేను ఆయనకు చెప్పాలనుకుంటున్నాను. మేము రాష్ట్రంలో నేరాలను తగ్గించాం. గూండాలు మాఫియా పాలనను తొలగించాము’’ అని ఆయన చెప్పారు. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో 7 ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఈ నెల 10వ తేదీన మొద‌టి ద‌శ ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. రెండో ద‌శ ఎన్నిక‌లు మ‌రో రెండు రోజుల్లో అంటే ఫిబ్ర‌వ‌రి 14 వ తేదీన జ‌ర‌గ‌నున్నాయి. మూడో ద‌శ ఎన్నిక‌లు ఫిబ్ర‌వ‌రి 20, నాలుగో ద‌శ ఎన్నిక‌లు ఫిబ్ర‌వ‌రి 23, ఐదో ద‌శ ఎన్నిక‌లు ఫిబ్ర‌వ‌రి 27, ఆరో ద‌శ ఎన్నిక‌లు మార్చి 3, ఏడో ద‌శ ఎన్నిక‌లు మార్చి 7వ తేదీన నిర్వ‌హించ‌నున్నారు. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపి చేప‌ట్టి అదే రోజు ఫ‌లితాలు వెల్ల‌డిస్తారు.