ఉత్తరప్రదేశ్ లోని బదౌనాలో ఎన్నికల ప్రచార సభలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ ఒక అబద్దాల పార్టీ అని అన్నారు. రెండో దశ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లు పడవని తెలిపారు. 

UP Election News 2022 : ఉత్త‌రప్ర‌దేశ్ (utharpradhesh)లో రెండో ద‌శ ఎన్నిక‌లకు ఒక్క రోజు స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఈ నేప‌థ్యంలో అన్ని పార్టీల త‌మ వ్యూహాల‌ను వేగ‌వంతం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఓట‌ర్ల‌ను ఆక‌ర్శించుకునేందుకు నేత‌లు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను త‌మ వైపు తిప్పుకునేందుకు ప‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో స‌మాజ్ వాదీ (samajwadi party) పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ (akhilesh yadav) బీజేపీ (bharathiya janatha party- bjp)పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. బీజేపీ అబ‌ద్దాల పార్టీగా అభివ‌ర్ణించిన ఆయ‌న‌.. రెండో ద‌శ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంద‌ని జోష్యం చెప్పారు.

బదౌనా (badhoun)లో శ‌నివారం నిర్వ‌హించిన ఎన్నిక‌ల ర్యాలీలో అఖిలేష్ యాద‌వ్ మాట్లాడారు. బీజేపీకి చెందిన చిన్న నాయకులు చిన్న అబద్ధాలు చెబుతున్నార‌ని, పెద్ద నాయకులు పెద్ద అబద్ధాలు చెబుతున్నార‌ని అన్నారు. అయితే వారి అగ్ర నాయకుడు కూడా పెద్ద అబద్ధాలు చెబుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి మాట్లాడారు. ఫిబ్రవరి 10న 58 స్థానాలకు జ‌రిగిన మొదటి దశ పోలింగ్ లో ప్రజలు బీజేపీని ఓడించాలని నిర్ణయించుకున్నారని అన్నారు. అయితే ఫలితం తెలియాలంటే మార్చి 10 వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. 

రాష్ట్రంలో అధికార బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అఖిలేష్ యాద‌వ్.. తొలి దశలో ఓటింగ్ శాతం బీజేపీకి వ్యతిరేకంగా గాలి దిశను మార్చిందని అన్నారు. ప్రతిపక్ష ఎస్పీ-ఆర్ఎల్ఢీ (SP-RLD) కూటమి అధికారంలోకి వస్తుందని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. బుదౌన్, సంభాల్, మొరాదాబాద్లలో జ‌రిగే రెండో ద‌శ ఎన్నిక‌ల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (cm yogi adhithyanath) చేసిన “గర్మీ నికల్నా” వ్యాఖ్యపై తీవ్రంగా ధ్వ‌జ‌మెత్తారు. మొద‌టి రౌండ్ ఎన్నిక‌ల త‌రువాత బీజేపీ “చల్లబడింది’’ అని తెలిపారు. 

బ‌హుజ‌న్ స‌మాజ్ వాదీ పార్టీ (bsp) చీఫ్‌, యూపీ మాజీ సీఎం మాయ‌వ‌తి (former cm mayavathi)పై కూడా అఖిలేష్ యాద‌వ్ మండి ప‌డ్డారు. బీజేపీని ఓడించేందుకు ఎస్పీ పనిచేస్తోందని, అయితే ఒక పార్టీ మాత్రం ఎస్పీని ఆపాలని భావిస్తోందని బీఎస్పీని ఉద్దేశించి అన్నారు. భార‌త దేశ రాజ్యాంగాన్ని క‌ల‌ప‌డానికి, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మార్పులు తీసుకురావ‌డానికి సమాజ్ వాదీలు, అంబేద్కరిస్టులు చేతులు క‌ల‌పాల‌ని ఆయ‌న అన్నారు. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మొత్తం ఏడు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్వ‌హించింది. ఈ నెల 10వ తేదీన నిర్వ‌హించిన అసెంబ్లీ ఎన్నికల్లో 60.17 శాతం ఓటింగ్ నమోదైంది, షామ్లీ (shamli), ముజఫర్‌నగర్‌ (muzafarnagar) లలో వరుసగా 69.4 శాతం, 65.3 శాతం పోలింగ్ న‌మోదైంది. రెండో ద‌శ ఎన్నిక‌లు ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో భాగంగా తొమ్మిది జిల్లాలు అయిన సహారన్‌పూర్ (Saharanpur), బిజ్నోర్ (Bijnor), అమ్రోహా (Amroha), సంభాల్ (Sambhal), మొరాదాబాద్ (Moradabad), రాంపూర్ (Rampur), బరేలీ (Bareilly), బుదౌన్ (Budaun), షాజహాన్‌పూర్‌ (Shahjahanpur) పరిధిలో మొత్తం 55 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి.