యూపీ లో రెండో దశ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బకు తగిలింది. అమ్రోహా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న ఓ నేత శుక్రవారం సమాజ్ వాదీ పార్టీలో చేరారు.  

UP Election News 2022 : యూపీ (up) లో ఒక ద‌శ ఎన్నిక‌లు ముగిశాయి. రెండో ద‌శ ఎన్నిక‌ల‌కు అంతా సిద్ధం అవుతున్న వేళ కాంగ్రెస్ (congress) పార్టీకి ఎదురుదెబ్బ త‌గిలింది. అమ్రోహా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత శుక్ర‌వారం సమాజ్‌వాదీ పార్టీ (samajwadi party)లో చేరారు. అమ్రోహా (సదర్ సీటు) స్థానానికి కాంగ్రెస్ నుంచి సలీం ఖాన్ (saleem khan) అభ్య‌ర్థిగా ఉన్నారు. అయితే ఆయ‌న ఉన్న‌ట్టుండి రాంపూర్ లో స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) సమక్షంలో పార్టీలో చేర‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. 

అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (bjp)కి దూరంగా ఉండాలంటే సమాజ్‌వాదీ పార్టీకి ప్రజలు తప్పనిసరిగా ఓటు వేయాలని బహిరంగంగా చెప్పడం ద్వారా ప్ర‌స్తుతం ఎస్పీలో చేరిన స‌లీం ఖాన్ గతంలో వార్తల్లో నిలిచారు. ఉత్తరప్రదేశ్ (utharapradhesh) అసెంబ్లీకి రెండో దశ పోలింగ్ ఫిబ్రవరి 14న జరగనుంది. రెండో దశలో 55 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 586 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, ఇందులో తొమ్మిది షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడ్డాయి. రిజర్వ్ చేయబడిన స్థానాల్లో సహారన్‌పూర్, బిజ్నోర్, అమ్రోహా (జేపీ నగర్), మొరాదాబాద్, బరేలీ, రాంపూర్, సంభాల్ (భీమ్ నగర్), బుదౌన్ మరియు షాజహాన్‌పూర్ జిల్లాలు ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా, చివరి దశ పోలింగ్ మార్చి 7న నిర్వహించనున్నారు. ఫలితాలు మార్చి 10న వెల్ల‌డి కానున‌న్నాయి. గురువారం ఓటింగ్ జరిగిన ఉత్తరప్రదేశ్‌లోని 11 జిల్లాల్లో సాయంత్రం 6 గంటల వరకు 60.17 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అంచనా వేసింది. అయితే నిన్న జ‌రిగిన పోలింగ్ స‌ర‌ళిపై అన్ని పార్టీలు గెలుపు త‌మదే అని ధీమాలో ఉన్నాయి. అయితే ప్ర‌ధానంగా అధికార బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్యే పోటీ నెలకొంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో 403 స్థానాలు ఉన్నాయి. 2017 సంవ‌త్స‌రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు సాధించి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఎంపీగా ఉన్న యోగి ఆదిత్య‌నాథ్ సీఎం ప‌గ్గాలు చేప‌ట్టారు. త‌రువాత ఆయ‌న శాస‌న మండ‌లికి ఎంపిక‌య్యారు. అఖిలేష్ యాద‌వ్ నేతృత్వంలోని స‌మాజ్ వాదీ పార్టీ ప్ర‌తిప‌క్షం స్థానంలో నిలిచింది. అయితే ఈ సారి స‌మాజ్ వాదీ పార్టీ తిరిగి అధికారం చేప‌ట్టాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. అందులో భాగంగానే బీజేపీలో ఉన్న ముఖ్య నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకునేలా ప్రయత్నించింది. ఈ క్ర‌మంలోనే బీజేపీ నుంచి ఇద్ద‌రు మంత్రులు, న‌లుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఇత‌ర నాయ‌కులు స‌మాజ్ వాదీలో చేర్చుకొంది. ఈ సారి యూపీలో జ‌రిగే ఎన్నిక‌ల‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. గతంలో యూపీ సీఎంగా ప‌ని చేసిన అఖిలేష్ యాద‌వ్, ప్ర‌స్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్ మొదటి సారి శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు. వీరు గ‌తంలోనే శాస‌నమండ‌లికి ఎంపిక‌యి సీఎం ప‌గ్గాలు చేప‌ట్టారు. గోర‌ఖ్ పూర్ అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి యోగి ఆదిత్య‌నాథ్, క‌ర్హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అఖిలేష్ యాద‌వ్ పోటీ చేస్తున్నారు.