యూపీ ప్రభుత్వంలో, రాష్ట్ర బీజేపీలో నెంబర్ 2 గా ఉన్న కేశవ్ ప్రసాద్ మౌర్య ఈ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అప్నాదళ్ (కే) అభ్యర్థి పల్లవి పటేల్ చేతిలో 7 వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. దీంతో ప్రస్తుత ప్రభుత్వంలో నెంబర్ 2 ఎవరనేది ఆసక్తికరంగా మారింది. 

ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh)లో బీజేపీ (bjp) భారీ విజయం సాధించింది. దీంతో యూపీలో కాషాయ జెండా మ‌రో సారి రెప‌రెప‌లాడ‌నుంది. స‌మాజ్ వాదీ పార్టీ అధికారం కోసం ఎంతో పోరాడినా.. విజ‌యం సాధించ‌లేకపోయింది. నిన్న కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌క‌టించిన ఎన్నిక‌ల ఫ‌లితాల ప్ర‌కారం బీజేపీ దాని మిత్రప‌క్షాల‌తో క‌లిసి 273 స్థానాల్లో గెలుపొందింది. దీంతో యోగి ఆదిత్య‌నాథ్ (yogi adityanath) రెండో సారి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టి రికార్డు సృష్టించ‌నున్నారు. 

యోగి ఆదిత్య‌నాథ్ రెండో సారి సీఎం పీఠంపై కూర్చోబోతున్న‌ప్ప‌టికీ.. డిప్యూటీ సీఎం ఎవరు అనే విష‌యంపై ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. యూపీలో బీజేపీ విజ‌య దుందుభి మోగించిన‌ప్ప‌టికీ.. రాష్ట్ర బీజేపీలో, ప్ర‌భుత్వంలో నెంబ‌ర్ 2గా ఉన్న ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య (keshav prasad mourya) ఎన్నికలలో ఓడిపోయారు.ఆయ‌న సిరతు (sirathu) నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీ బ‌రిలో నిలిచారు. అయితు ఆయ‌న ప్ర‌త్య‌ర్థి, అప్నా దళ్ (కామెరవాడి)కి చెందిన అభ్య‌ర్థి ప‌ల్ల‌వి పటేల్ (pallavi patel) చేతిలో సుమారు 7,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు, అప్నాద‌ళ్ (కే) స‌మాజ్ వాదీ పార్టీకి మిత్ర‌ప‌క్షంగా ఉంది. 

సిర‌తు నియోజ‌క‌వ‌ర్గంలో మొద‌టి నుంచి ఎన్నిక‌ల ప్ర‌చారం హోరా హోరీగా సాగింది. బీజేపీ అభ్య‌ర్థి కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య త‌ర‌ఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (narendra modi), కేంద్ర మంత్రులు అమిత్ షా (amith shah), నితిన్ గడ్కరీ (Nitin Gadkari), బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా (BJP chief JP Nadda) ప్ర‌చారం నిర్వ‌హించారు. అలాగే బీజేపీకి స‌న్నిహితంగా ఉండే అనుప్రియా పటేల్ (anu priya patel) కూడా మౌర్య త‌ర‌ఫున ప్ర‌చారం చేశారు. ఆమె అప్నాద‌ళ్ (కే) అభ్య‌ర్థి అయిన పల్లవి పటేల్ కు సోదరి. అయినా అక్క‌డ ఆయ‌న విజ‌యం సాధించ‌లేక‌పోయారు. 

గురువారం ఓట్ల లెక్కింపు కార్య‌క్ర‌మం కొన‌సాగుతుండ‌గా మొద‌టి రౌండ్ లో కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య ఆధిక్యంలో ఉన్నార‌ని సమాచారం వెలువ‌డింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ట్విట్ట‌ర్ లో ‘‘ ప్రజలు గెలుస్తున్నారు. గూండాయిజం ఓడిపోతోంది.’’ అంటూ ట్వీట్ చేశారు. కాగా చివరికి పల్లవి పటేల్ గెలుపొందారు. 

యోగి ప్ర‌భుత్వంలోని ఉప ముఖ్య‌మంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యతో పాటు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలోని మరో 10 మంది మంత్రులు కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. యూపీ బీజేపీ ప్ర‌భుత్వంలో ఉన్న రెండో ఉప ముఖ్య‌మంత్రి దినేష్ శర్మ (dinesh sharma) ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాగా.. కేశవ్ మౌర్య అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టికీ శాస‌న మండ‌లికి ఎన్నిక‌వుతార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అయితే ఆయ‌న ఉప ముఖ్యమంత్రిగా కొనసాగాలా, లేదా ఆయ‌న‌ స్థానంలో మరో నాయ‌కుడు వ‌స్తారా అనే విషయంలో పార్టీ ఇంకా స్ప‌ష్టత ఇవ్వ‌లేదు. 

ప్ర‌స్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఇంత వ‌ర‌కు శాస‌న మండ‌లి స‌భ్యుడిగా ఉన్నారు. ఈ ఎన్నిక‌ల్లోనే ఆయ‌న మొట్ట మొద‌టి సారి గోర‌ఖ్ పూర్ అర్బ‌న్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. భారీ మెజారిటీతో గెలుపొందారు. గ‌తంలో సీఎంగా ఉన్న అఖిలేష్ యాద‌వ్ కూడా శాస‌న మండ‌లి స‌భ్యుడుగానే ఉన్నారు. ఈ సారి ఆయ‌న కూడా మొద‌టి సారి క‌ర్హ‌ల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. 

మొత్తంగా 403 మంది సభ్యులున్న యూపీ అసెంబ్లీలో వరుస‌గా రెండో సారి అధికారం చేప‌ట్ట‌నున్న పార్టీగా బీజేపీ చ‌రిత్ర సృష్టించ‌నుంది. గ‌తంలో ఏ పార్టీ కూడా వ‌రుస‌గా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌లేదు. ఈ సారి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ, దాని మిత్రపక్షాలు 135 సీట్లకు పైగా గెలుచుకున్నాయి.