ఉత్తరప్రదేశ్ లోని అజంగఢ్ స్థానం నుంచి AIMIM తరఫున పోటీ చేస్తున్న షా ఆలమ్ ఆలమ్ పై దాడి జరిగింది. అయితే ఈ దాడిని సమాజ్ మాదీ పార్టీ కార్యకర్తలే చేశారని AIMIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
UP Election News 2022 : యూపీలోని అజంగఢ్ ( Azamgarh) లో ఏఐఎంఐఎం అభ్యర్థి షా ఆలమ్ (Shah Alam) పై శనివారం రాత్రి దాడి జరిగింది. అయితే ఈ దాడని ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ‘‘ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి షా ఆలం అలియాస్ గుడ్డు జమాలిపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కార్యకర్తలు గత రాత్రి మద్యం సేవించి అజంగఢ్ నగరంలో దాడి చేశారు’’ అని అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi)పేర్కొన్నారు.
ఈ ఘటనపై అజంగడ్ పరిధిలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ (Kotwali police station)లో 8 మంది వ్యక్తులపై, చాలా మంది సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలపై AIMIM అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఈ దాడి విషయాన్ని అసదుద్దీన్ ఓవైసీ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘‘ నిన్న రాత్రి (శనివారం) 1:30 గంటలకు మా అభ్యర్థి షా ఆలం అలియాస్ గుడ్డు జమాలీ సాహబ్‌పై అజంగఢ్ నగరంలోని మొహల్లా కోట్ చౌరాహాలో ఎస్పీ (samajwadi party) కార్యకర్తలు దాడి చేశారు. దాడి చేసినవారు మద్యం మత్తులో ఉన్నారు. జమాలీ సాహిబ్ తో పాటు ఇద్దరు సహచరులు తీవ్రంగా గాయపడ్డారు. అల్హమ్దులిల్లా షా ఆలం సాహబ్ క్షేమంగా ఉన్నారు.’’ పేర్కొన్నారు.
‘‘ఎస్పీ భయాందోళనలకు గురవుతోంది. అయితే మేము తూటాలు, లాఠీలకు భయపడము. శాంతియుతంగా ఓటింగ్ కోసం ఈ సంఘ వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు అవసరం. మేము కూడా ఫిర్యాదు చేసాము’’ అని ఆయన మరో ట్వీట్ లో ఎన్నికల సంఘాన్ని, స్థానిక పోలీస్ స్టేషన్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు.
ముబారక్‌పూర్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన షా ఆలం తనపై జరిగిన దాడిని ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు తనపై తీవ్రంగా దాడి చేశారని చెప్పారు. అనంతరం AIMIM పార్టీ కార్యకర్తలను కొట్టారని కూడా ఆరోపించారు.
2012, 2017లో షా ఆలం బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (BSP) టిక్కెట్‌పై రెండుసార్లు గెలుపొందారు. అనంతరం 2021లో ఆయన ఆ పార్టీని వీడారు. దీని కంటే ముందే ఆయన తనకు సమాజ్ వాదీ పార్టీ తరఫున టికెట్ ఇవ్వాలని కోరుతూ ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (akhilesh yadav)ను కలిశారు. కానీ అఖిలేష్ యాదవ్ ఆయనకు టికెట్ నిరాకరించడంతో షా ఆలం AIMIMలో చేరారు. ప్రస్తుతం ఆయన పోటీ చేస్తున్న ముబారక్ పూర్ లో ముస్లిం జనాభా అధికంగా ఉంటుంది. అక్కడి నుంచే ఆయనను AIMIM పోటీలో నిలిపింది.
ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్ లో నేడు ఏదో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. తొమ్మిది జిల్లాల పరిధిలోని 54 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల బరిలో వివిధ పార్టీల నుంచి, స్వతంత్రంగా 613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తంగా ఇప్పటి వరకు ఆరు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. నేడు చివరి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 10వ తేదీన మొదట దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మార్చి 10వ తేదీన ఈ ఎన్నికల ఫలితాలను లెక్కిస్తారు.
