UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ లో చివరిదశ అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే మిగిలివున్నాయి. అయినప్పటికీ.. ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం సాగిస్తూ.. విమర్శలు.. ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇటీవల బీజేపీలో చేరిన ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ అన్నారు.
UP Assembly Election 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికలు మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికే పలు దశల ఎన్నికలు పూర్తయిన క్రమంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతుండటంతో రాజకీయాలు కాక రేపుతున్నాయి. రాష్ట్రం (Uttar Pradesh) లో మళ్లీ అధికారం దక్కించుకోవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తుండగా, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ సైతం తనదైన స్టైల్ లో ప్రచారం కొనసాగిస్తూ.. అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తుంది. అలాగే, గత వైభవాన్ని కొల్పోయిన కాంగ్రెస్, బీఎస్పీలు సైతం తమదైన తరహాలో ప్రచారం కొనసాగిస్తూ.. ఓటర్లను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే ఆరు దశల పోలింగ్ పూర్తయింది.
ఇక యూపీలో చివరి దశ ఎన్నికల పోలింగ్ మాత్రమే మిగిలివుంది. అయినప్పటికీ ఇక్కడి రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు-2022 గురించి ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా బిష్త్ యాదవ్ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందనీ, పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు అవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అపర్ణా బిష్త్ యాదవ్ చురుకైన రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు సామాజిక కార్యకర్త కూడా, అలాగే, BJP స్టార్ క్యాంపెయినర్. 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై లక్నోలోని కాంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే, ఎన్నికలకు ముందు ఆమె ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల వర్కింగ్ స్టైల్‌కు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె బీజేపీ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం కొనసాగిస్తున్నారు.
ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ 2022 అసెంబ్లీ ఎన్నికలలో మొదటి దశ ఓటింగ్‌కు ముందే సమాజ్ వాదీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. బీజేపీతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇప్పుడు అన్ని చోట్లా ఎన్నికల ప్రచారంలో ఆమె సమాజ్ వాదీ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సమాజ్ వాదీ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. ఎస్పీ కుట్రకు తగిన సమాధానం చెప్పాలని, నా ముఖం పగలకొట్టవలసి వచ్చినా నా ముఖం కూడా పగలగొడతాను అని అపర్ణ అన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోడీలను ఆయన తీవ్రంగా కొనియాడారు. దీంతో హనుమంతుడిలా పోరాడి రాముడిలా గెలుస్తాం అని అన్నారు.
