ఉత్తరప్రదేశ్‌లో బలియా జిల్లా హాస్పిటల్‌లో కరెంట్ లేక వైద్యులు మొబల్ టార్చ్ వెలుతురులో పేషెంట్లుకు చికిత్స అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఓ హాస్పిటల్ నుంచి ఆందోళనకర వీడియోలు బయటకు వచ్చాయి. అందులో డాక్టర్లు కటిక చీకటిలో పేషెంట్ల వద్దకు వెళ్లి చికిత్స చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. వారు కేవలం మొబైల్ ఫోన్ టార్చ్ పెట్టుకుని ఆ వెలుగులోనే ట్రీట్‌మెంట్ చేశారు. ఈ ఘటన బలియా జిల్లాలో చోటుచేసుకుంది.

నిన్న పడిన భారీ వర్షానికి ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో కరెంట్ సేవలు నిలిచిపోయాయి. తద్వారా అక్కడి ఓ హాస్పిటల్‌లో కరెంట్ లేకుండా పోయింది. జెనరేటర్లు ఉన్నప్పటికీ ఆ సమయంలో విద్యుత్ అందించలేకపోయాయి. దీంతో వైద్యులు పేషెంట్ల వద్దకు వెళ్లి చీకట్లోనే ట్రీట్‌మెంట్ చేశారు. అందులో ఒకరు ప్రత్యేకంగా మొబైల్ టార్చ్ పట్టుకోవడానికి నిలుచుకుని కనిపించారు. మొబైల్ టార్చ్ వెలుగులోనే చికిత్స అందించారు. 

Scroll to load tweet…

మరో వీడియోలో చాలా మంది ఓ మహిళను తీసుకువస్తున్న స్ట్రెచర్ చుట్టూ మూగారు. అందులో ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ పట్టుకుని టార్చ్ లైన్ ఆన్ చేశారు. ఆ టార్చ్ వెలుగులో డాక్టర్ ఆమెను పరిశీలిస్తున్నాడు. అలాగే, చీకట్లో వైద్యుడి కోసం ఎదురుచూస్తున్న పేషెంట్లు ఫొటోలూ బయటకు వచ్చాయి. 

ఈ ఘటనపై జిల్లా హాస్పిటల్ ఇంచార్జ్ డాక్టర్ ఆర్డీ రామ్ స్పందించారు. కరెంట్ పోయిన తొలి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆందోళన రేగిందని వివరించారు. జెనరేటర్లో బ్యాటరీల కోసం తమకు ఆ సమయం పట్టిందని తెలిపారు.

హాస్పిటల్‌కు జెనరేటర్ సౌకర్యం ఉన్నదని వివరించారు. అయితే, జెనరేటర్ వద్దకు బ్యాటరీలను తీసుకెళ్లడమే ఆలస్యం అయిందని తెలిపారు. అయితే, జెనరేటర్ ఉన్నప్పుడు అందులోనే బ్యాటరీలు ఎందుకు పెట్టలేదని విలేకరులు ప్రశ్నించారు. ఆ జెనరేటర్ నుంచి బ్యాటరీలు దొంగిలిస్తారనే భయాలు తమలో ఉండిపోయాయని, అందుకే వాటిని అక్కడి నుంచి తొలగించినట్టు వివరించారు. ఈ ఘటన పై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.